రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు గతంలో.! కానీ, ఇప్పుడు ఇద్దరూ కలిశారు, బీజేపీని కూడా కలుపుకున్నారు. కూటమిగా ముందుకు వెళుతున్నారు.
మొదట్లో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య అస్సలు సయోధ్య లేదు. ఈ కూటమి వర్కవుట్ అయ్యేది కాదంటూ సోషల్ మీడియాలో స్పేసులు పెట్టి మరీ, నానా యాగీ చేసుకున్నారు.
అందుకే, అధినేతలు జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. పలుమార్లు కలిశారు, కలిసి మాట్లాడుకున్నారు. తమ తమ శ్రేణులకు ‘పొత్తు’పై కీలకమైన సందేశం తమ కలయిక ద్వారా స్పష్టంగా ఇచ్చారు.
ఇక, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కనిపిస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర పొగడ్తలు ఓ స్థాయి దాటి మరీ గుప్పించుకుంటుండడం గమనార్హం. ‘మరీ ఇంతలా పొగుడుకోవాలా.?’ అని కొందరు అనుకోవచ్చుగాక.!
కూటమి గెలుపుని చారిత్రక అవసరంగా భావిస్తున్న టీడీపీ, జనసేన.. అందుకు తగ్గట్టుగా పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. బీజేపీని కూడా టీడీపీ, జనసేన అలాగే కలుపుకుపోతున్నాయి. అయితే, బీజేపీ కొంత ప్రచారంలో వెనకబడినమాట వాస్తవం.
నామినేషన్ల పర్వం మొదలైంది గనుక, బీజేపీ నుంచి కూడా పూర్తిస్థాయిలో టీడీపీ, జనసేనకి సహాయ సహకారాలు ప్రచారం పరంగా అందే అవకాశాల్లేకపోలేదు.
గతంలో చేసుకున్న విమర్శల సంగతెలా వున్నా, నామినేషన్ పర్వం దగ్గరకొచ్చేసరికి మూడు పార్టీల శ్రేణుల మధ్య పొరపచ్చాలు పూర్తిగా తొలగిపోయాయి. మూడు పార్టీల కార్యకర్తలూ కూటమి జెండాల్ని రెపరెపలాడిస్తున్న వైనం.. చూసే జనానికి కూడా ముచ్చటేస్తోందనడం అతిశయోక్తి కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates