నామినేష‌న్ల ప‌ర్వం స‌రే.. అభ్య‌ర్థుల్లో వ‌ణుకు.. రీజ‌నేంటి?

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి మూడో ద‌శ ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌ర్వానికి గురువారం శ్రీకారం చుట్ట‌నున్నా రు. ఈ క్ర‌మంలో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్థానాల‌కు కూడా నోటిఫికేష‌న్ రానుంది. ఇక‌, గురువారం నుంచి ఈ నెల 25 వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్నారు. 26న ప‌రిశీలించి.. నిర్ధారించ‌నున్నారు. ఇక‌, నామినేష‌న్లు వేసిన వారు.. ఉప‌సంహ‌రించుకునేందుకు ఈ నెల 29 వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అయితే.. ఈ క్ర‌తువు ఎలా ఉన్నప్ప‌టికీ.. ఒక్క జ‌న‌సేన మిన‌హా ఇత‌ర పార్టీల్లో మాత్రం అభ్య‌ర్థులు చాలా మంది వ‌ణుకుతున్నారు.

వైసీపీ, బీజేపీ, టీడీపీల‌లో అభ్య‌ర్థుల ఎంపిక అయితే.. పూర్త‌యింది. కానీ, అభ్య‌ర్థుల ఎంపిక త‌ర్వాత‌.. ఆయా పార్టీలు క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టిన స‌ర్వేలు.. అసంతృప్తుల నుంచి వ‌చ్చిన ఇబ్బందులు.. ఆరోప‌ణ‌లు, నిరస‌న‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌ను కొన‌సాగిస్తారా? లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉంది. అదేస‌మ‌యంలో తాము ముందుగానే ప్ర‌క‌టించిన స్థానాల్లో ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌మైన నాయ‌కుల‌ను నిల‌బెట్ట‌డం కూడా.. పార్టీల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఇలా.. పార్ల‌మెంటు స్థానాల్లో టీడీపీకి 2 నుంచి 3, వైసీపీకి 2 నుంచి 3,. బీజేపీ 2 స్థానాల్లో మార్పులు చేసే అవ‌కాశం ఉంది.

అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ 5 చోట్ల అభ్య‌ర్థుల‌ను మార్చే అవ‌కాశం ఉంది. ఇక‌, టీడీపీ ఐదు చోట్ల ప‌రిశీల‌న చేస్తోంది. బీజేపీ కూడా.. మూడు స్థానాల్లో మార్పుల‌కు ఖాయ‌మ‌ని చెబుతోంది. ఈ నేప‌థ్యంలో నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభ‌మైనా.. బీఫాం ద‌క్కే వ‌ర‌కు కూడా నాయ‌కుల‌కు కంటిపై నిద్ర లేకుండా పోతోంది. ముఖ్యంగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ, ఇటీవ‌ల టీడీపీ తీర్థం పుచ్చుకున్న ర‌ఘురామ‌కృష్ణం రాజుకు ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాలేదు. విజ‌య‌వాడలో కేశినేని చిన్నిని విజ‌య‌వాడ ప‌శ్చిమ‌కు పంపించి.. అక్క‌డ నుంచి బీజేపీ క్యాండిడేట్‌గా ఉన్న సుజ‌నాను విజ‌య‌వాడ ఎంపీగా తీసుకువ‌స్తున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

ఇక‌, అన‌కాప‌ల్లిలో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి బూడి ముత్యాల‌నాయుడును మార్చుతార‌ని ప‌క్కాగా తెలుస్తోంది. న‌రసాపురం బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి శ్రీనివాస‌వ‌ర్మ స్థానం కూడా క‌దిలిపోతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా.. చాలా చోట్ల అభ్య‌ర్థుల‌కు బీఫాం ద‌క్కేవ‌ర‌కు గ్యారెంటీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ స‌మ‌స్య జ‌న‌సేన‌లో లేకుండా పోయింది. బుధ‌వార‌మే ఈ పార్టీ 21 మంది అసెంబ్లీ అభ్య‌ర్థుల‌కు , ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు ఇచ్చేసింది.