టీడీపీ, జనసేన పొత్తు కొన్ని చోట్ల టీడీపీకి తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను తప్పనిసరి పరిస్థితులలో వదులుకోవాల్సిన నేపథ్యంలో పార్టీలో ఉండి అవకాశం కోల్పోయిన నేతలను బుజ్జగించలేక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటున్నది. విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ స్థానాన్ని 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆ నియోజకవర్గాన్ని ఈ సారి పట్టుబట్టి పొత్తులో భాగంగా తీసుకుంది.
జనసేన తరపున ఇక్కడి నుండి వైసీపీని వీడి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబును ఎమ్మెల్యేగా పోటీకి దింపారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లడం ఒకటైతే, అక్కడ తన చిరకాల ప్రత్యర్ధి పంచకర్ల రమేష్ బాబును పోటీకి దింపడం, అతడి గెలుపుకు తనను పనిచేయాలని చెప్పడం నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేత బండారు సత్యనారాయణకు ఏ మాత్రం రుచించడం లేదు.
పొత్తులో భాగంగా ఈ స్థానం పక్కకు పోతుందని ఊహించిన బండారు సత్యనారాయణ ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. అయినా ఈ స్థానం కోసం టీడీపీ పట్టుబట్టలేదు. దీంతో తన ప్రత్యర్ధి గెలుపు కోసం తాను పనిచేయలేనని బండారు సహాయ నిరాకరణ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీలో ఉన్న గండి బాబ్జి వర్గం బండారుతో సంబంధం లేకుండా జనసేన అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కూడా బండారుకు రుచించడం లేదు. విషయం తెలుసుకున్న చంద్రబాబు బండారును పిలిచి బుజ్జగించినా వినకపోవడంతో ఫైర్ అయినట్లు సమాచారం. ఈ సహాయ నిరాకరణ ఎక్కడికి దారితీస్తుందోనని రాజకీయ వర్గాలు వేచిచూస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates