స్ట్రైక్ రేట్ మీద ఫోకస్ పెట్టిన టీడీపీ.!

జనసేన, బీజేపీలకు ఎక్కువ సీట్లు అనవసరంగా కేటాయించేశారంటూ తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఇంకా కొంత ‘అలక’ అధినాయకత్వంపై కనిపిస్తోంది. పొత్తులన్నాక, ఆయా రాజకీయ పార్టీలు కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదు. టీడీపీ, జనసేన చేసిన త్యాగాల్ని బీజేపీ జస్ట్ ఎంజాయ్ చేస్తోదంతే, గట్టిగా నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేంత సీన్ బీజేపీకి లేదు. లోక్ సభ పరిస్థితి మరీ దారుణం. ఇది రాజకీయ విశ్లేషకుల్లో నిన్న మొన్నటిదాకా జరిగిన చర్చ.

అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు స్ట్రైక్ రేట్ మీద ఫోకస్ పెట్టాల్సివుంది. తాజాగా వెలుగు చూసిన ఓ సర్వే ప్రకారం జనసేన పార్టీ పోటీ చేసే రెండు లోక్ సభ నియోజకవర్గాల్నీ గెలుచుకుంటుందని తేలింది. మరి, టీడీపీ పరిస్థితేంటి.? బీజేపీ సంగతేంటి.?

బీజేపీ మాటెలా వున్నా, టీడీపీ పక్కాగా 100 శాతం స్ట్రైక్ రేట్‌తో లోక్ సభ సీట్లన్నిటినీ గెలుచుకునే దిశగా పార్టీ శ్రేణులు కష్టపడాలని పార్టీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ వైపు నారా లోకేష్, ఇంకో వైపు చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో అలుపెరగకుండా కష్టపడుతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.

లోక్ సభ సీట్లు మాత్రమే కాదు, అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా స్ట్రైక్ రేట్ పక్కాగా వుండాలన్న కసితో టీడీపీ పనిచేస్తోంది. ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో చెప్పలేం. ఈ క్రమంలోనే టీడీపీ సింగిల్‌గా స్పష్టమైన మెజార్టీ సాధించేందుకు అవసరమైన స్థానాల్ని గెల్చుకోవాలన్నది టీడీపీ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది.

ఈ క్రమంలో కూటమిలోని ఇతర పార్టీల నుంచి తమ తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బలమైన మద్దతుని టీడీపీ ఆశిస్తోంది. బీజేపీ, జనసేన అభ్యర్థుల కోసం ఎలాగైతే టీడీపీ శ్రేణులు కష్టపడుతున్నాయో, అదే తరహాలో జనసేన, బీజేపీ శ్రేణులు కూడా టీడీపీ గెలుపు కోసం కృషి చేసేలా ఎప్పటికప్పుడు ఉమ్మడి సమావేశాల్ని టీడీపీ నిర్వహిస్తోంది.

నామినేషన్ల పర్వానికి రంగం సిద్ధమవుతున్న దరిమిలా, ఇక నుంచి మరింత ఎగ్రెసివ్‌గా టీడీపీ క్యాంపెయినింగ్ వుండబోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 90 పర్సంట్ స్ట్రైక్ రేట్ గనుక టీడీపీ కొట్టగలిగితే, ఆ విక్టరీ వేరే లెవల్‌లో వుంటుందన్నది నిర్వివాదాంశం.