ఏపీలో రాజకీయాల పై రాళ్లు పడుతున్నాయి. ఇదేదో చిన్న విషయం అని తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. పడుతున్న రాళ్లు పెద్ద నేతలను టార్గెట్ చేసుకునే! సీఎం జగన్ తో ప్రారంభమైన ఈ రాళ్లు-రాజకీయాలు.. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ వరకు సాగింది? దీని వెనుక ఎవరున్నారు? ఎవరు చేస్తున్నారు? నిజంగానే వీరిని టార్గెట్ చేసుకుని వేస్తున్నారా? లేక ఏదో చర్చకు పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారా? అనే విషయాలు పక్కన పెడితే.. రాళ్లు పడుతున్నది మాత్రం వాస్తవం.
కారణాలు ఏంటి?
ఈ రాళ్లు-రాజకీయాల వెనుక.. ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 1) రెచ్చగొట్టే ప్రసంగాలు. 2) పార్టీల మధ్య పెరిగిపోయిన వైషమ్యాలు. 3) ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి. ఈ మూడు కారణాలే ఈ రాళ్ల దాడులకు ప్రధానంగా హేతువులు అవుతున్నాయనేది పరిశీలకులు చెబుతున్న మాట.
1) రెచ్చగొట్టే ప్రసంగాలు: ఈ విషయంలో ఒక పార్టీనే ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. అన్ని పార్టీలదీ అదే తీరు. ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు కామన్ అయిపోయాయి. చంద్రబాబు వృద్ధుడని.. ఆయన ఒక సామాజిక వర్గం ప్రయోజనాలకే పరిమితం అయ్యారని వైసీపీ నేతలు రెచ్చగొట్టేస్తున్నారు. పోనీ.. టీడీపీవైపు నుంచి ఏమైనా సానుకూల ధోరణి ఉందా లేదు. ఇటు వైపు ఎంత అనాలో .. అనేస్తున్నారు. ఏమనాలో అన్నీ అనేస్తున్నారు. దీనికి జనసేన అధినేత అతీతం కానట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో ఆరోగ్య పూరిత రాజకీయం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇది యువతలో ద్వేషాన్ని పెంచేలా చేస్తోంది.
2) పార్టీల మధ్య వైషమ్యాలు: అన్ని పార్టీలూ మంచివే. ఇది ఒక కోణం. ఎవరు వచ్చినా ప్రజలకు సేవ చేస్తామనే చెబుతున్నారు. కానీ, ఈ రెండు ధ్రువాలకు భిన్నమైన వాదన ఏపీలోనే వినిపిస్తోంది. వైసీపీ అంటే దొంగలు, దోపిడీ దారుల పార్టీ అని టీడీపీ, జనసేనలు ప్రచారం చేస్తుంటే.. కాదు.. ఈ రెండు పార్టీలూ దొంగ పార్టీలని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి తొత్తులని వ్యాఖ్యలు చేస్తున్నాయి. దీంతో పార్టీల మధ్య నాయకుల మధ్య ఉండాల్సిన స్నేహపూరిత వాతావరణం, పోటీ కక్షసాధింపు రాజకీయాల దిశగా రూపాంతరం చెంది.. క్షేత్రస్థాయిలో పార్టీలపై వైషమ్యాలు పెంచేలా చేసింది.
3) ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి: దీనిని ప్రస్తుత అధికార పార్టీకే పరిమితం చేస్తే.. అది ఏకపక్షమే అవుతుంది. గతంలో పాలించినటీడీపీపైనా ప్రజల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. హోదా నుంచి పోలవరం వరకు.. ఆ పార్టీ పాలనలోనూ ఒరిగింది లేదనే వాదన ఉన్న మాట వాస్తవం. ఇక, వైసీపీలో అభివృద్ది లేదన్న ప్రచారం కూడా.. ఆ పార్టీపై అసంతృప్తిని ఆకాశమంత పెరిగేలా చేసింది. ఇదే.. రాళ్ల దాడులకు ప్రేరేపించేలా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. దీనికి కొన్ని శక్తులు.. కొందరు వ్యక్తులు కూడా తోడవడమే.. ఇప్పుడు ఎన్నికలను ఉత్కంఠగా మాత్రమేకాదు.. ఉద్రిక్తంగా కూడా మార్చేశాయని అంటున్నారు పరిశీలకులు.