ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ దాడి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైరికల్ గా ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ఆ రాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చిందని…జగన్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలని లోకేష్ చేసిన ట్వీట్ ట్రెండ్ అవుతోంది. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి మాదిరిగా 2024 ఎన్నికలకు ముందు జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారని లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ దాడి ఘటనపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా దాడి జరుగుతుందని ఓ వైసీపీ కార్యకర్త చేసిన ట్వీట్ ను అయ్యన్న రీ ట్వీట్ చేస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. మరో 4 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికల మూడ్ మార్చేసే ఘటన జరగబోతోందని మార్కెటింగ్ కన్సల్టెంట్, వైసీపీ కార్యకర్త అవుతు శ్రీధర్‌రెడ్డి చేసిన ట్వీట్ పై అయ్యన్న స్పందించారు. ఏప్రిల్ 12న శ్రీధర్ రెడ్డి చేసిన పోస్ట్ ను అయ్యన్న షేర్ చేశారు. ఈ దాడి గురించి శ్రీధర్ రెడ్డికి ముందే తెలిసి ఉండవచ్చన్న అనుమానాన్ని అయ్యన్న వ్యక్తం చేశారు.
ఎందుకంటే, శ్రీధర్ రెడ్డి ఈ తరహాలో ట్వీట్ చేయడం ఇది తొలిసారి కాదు. హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రధాన నిందితుడు, జగన్ కు సన్నిహితుడు అయిన శ్రీధర్ రెడ్డి చంద్రబాబు అరెస్టుకు ముందే సంచలనం జరగబోతుందని ట్వీట్ చేశాడని అయ్యన్న అన్నారు. ఇప్పుడు కూడా అలాంటిదే చేశాడని, దీని వెనక మర్మం ఏమిటో సీబీఐ తేల్చాలని అయ్యన్న డిమాండ్ చేశారు. అయితే, ఈ పోస్టుపై ఏపీ డీజీపీ సమగ్ర విచారణ జరిపించాలని శ్రీధర్ రెడ్డి కోరడం విశేషం.