ఇచ్చట రాళ్లు విసరబడును

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఆయా పార్టీల ఎన్నికల ప్రచారంలో నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీని రాళ్లతో కొట్టాలని పిలుపునివ్వడం, అదే రోజు రాత్రి విజయవాడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద రాయితో దాడి చేయడం మూలంగా ఎడమకన్ను పై భాగంలో దెబ్బతగలడంతో ఆంధ్రా రాజకీయాలు హీటెక్కాయి.

ఆదివారం విశాఖ జిల్లా గాజువాక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మీద రాయి వేశారు. అయితే అది ఎవరికీ తగలకుండా దూరంగా పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంధర్భంగా ఇటువంటి దాడులకు భయపడనని చంద్రబాబు హెచ్చరించారు. ఆ తర్వాత సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఓ వ్యక్తి రాయి విసిరాడు. అయితే అది పవన్ కు తగలకుండా దూరంగా పడడంతో రాయి వేసిన వ్యక్తిని జనసేన కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని చంద్రబాబు నాయుడు హుందాగా తప్పుపట్టగా, నారా లోకేష్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. శనివారం వైఎస్ జగన్ మీద దాడి తర్వాత ఆదివారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల మీద రాళ్ల దాడి జరగడంతో ఈ పరిణామాలు ఎన్నికల వరకు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళన నెలకొంది. అయితే ఈ రాళ్లదాడుల తర్వాత సోషల్ మీడియాలో ఇచ్చట రాళ్లు విసరబడును అని నెటిజన్లు సెటైర్లు విసురుతుండడం గమనార్హం.