ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రాయి.. వ్య‌క్తి అరెస్టు

ఏపీ  సీఎం జ‌గ‌న్‌పై రాయి వేసిన ఘ‌ట‌న నుంచి ఇంకా రాజ‌కీయాలు కోలుకోక ముందే.. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌క్ష్యంగా ఒక వ్య‌క్తి రాయి విసిరాడు. అయితే.. అది తృటిలో త‌ప్పిపోయి. సిబ్బంది చేతికి త‌గిలింది. అయితే.. ప‌ట్ట‌ప‌గ‌లే కావ‌డంతో రాయి విసిరిన వ్య‌క్తిని జ‌న‌సేన కార్య‌కర్త‌లు ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ స‌మ‌యంలో పెద్ద గంద‌ర‌గోళం చోటు చేసుకుంది.

ఏం జ‌రిగింది?

ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం .. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తెనాలిలో ప‌ర్య‌టించారు. వారాహి వాహ‌నంపై ఆయ‌న తెనాలిలో ప్ర‌చారం ప్రారంభించారు. స్థానిక అభ్య‌ర్థి, పార్టీ కీల‌క నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఇత‌ర నాయ‌కులు.. వారాహిపై ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలో ఆగంత‌కుడు ఒక‌రు గుంపులో నుంచి రాయి విసిరాడు. అయితే.. ఈరాయి.. తృటిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఎడ‌మ వైపు నుంచి దూసుకుపోయి.. సిబ్బందికి త‌గిలింది.

దీంతో వారాహి యాత్ర‌లో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. అయితే.. ఈ ఘ‌ట‌న సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌ర‌గడంతో రాయి విసిరిన వ్య‌క్తిని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వెంట‌నే గుర్తించి.. ప‌ట్టుకున్నారు. ఆ వెంట‌నే పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే.. అత‌ను వైసీపీ సానుభూతిప‌రుడ‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. పోలీసులు అత‌నిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు.