ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. తెలంగాణలో వ్యవహరించినంత యాక్టివ్‌గా ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ ఎందుకో యాక్టివ్‌గా వుండలేకపోతోంది. తెలంగాణలో బీజేపీ శ్రేణులు ఎన్నికల కోసం బాగానే సమాయత్తమయ్యాయి.
కానీ, ఏపీలో బీజేపీ మాత్రం, ‘టీడీపీ – జనసేన మా గెలుపు కోసం పనిచేస్తాయ్‌లే..’ అన్న ధీమాతో కనిపిస్తోంది. పురంధేశ్వరి సహా ఒకరిద్దరు నేతలు గ్రౌండ్‌లో కాస్త తిరుగుతున్నా, మెజార్టీ బీజేపీ అభ్యర్థులు పూర్తిస్థాయి అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
కాగా, బీజేపీ అభ్యర్థుల విషయమై టీడీపీ శ్రేణులు ఒకింత అనాసక్తి ప్రదర్శిస్తుండడం గమనార్హం. పొత్తు ధర్మంలో భాగంగా, టీడీపీ అలాగే జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో బీజేపీ శ్రేణులు కూడా ప్రచారం చేయాల్సి వుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు చాలా పలచగా కనిపిస్తున్నారు.
ఇవన్నీ, టీడీపీ శ్రేణులకు చికాకు కలిగిస్తున్నాయి. కానీ, అధినేత చంద్రబాబు సూచనలకు అనుగుణంగా బీజేపీ అభ్యర్థుల వెంట అన్యమనస్కంగానే తిరగాల్సి వస్తోంది టీడీపీ శ్రేణులకి. బీజేపీ జాతీయ నాయకత్వం కల్పించుకుని, రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపకపోతే, పొత్తు వల్ల పూర్తి ప్రయోజనం మూడు పార్టీలకీ కలగదన్నది టీడీపీతోపాటు జనసేన శ్రేణుల్లోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయం.
వున్నంతలో కాస్త సానుకూలత ఏంటంటే, జనసేన అభ్యర్థుల తరఫున బీజేపీ శ్రేణులు బాగానే ప్రచారం చేస్తున్నాయి. అలాగే బీజేపీ అభ్యర్థుల కోసం జనసేన శ్రేణులూ బాగానే పనిచేస్తున్నాయి. మరోపక్క, పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ – జనసేన శ్రేణుల మధ్యనా బాగానే అవగాహన వుంది.
వీలైనంత త్వరగా బీజేపీ అగ్రనేతలతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట బహిరంగ సభ నిర్వహించి, మూడు పార్టీల ఐక్యతపై మూడు పార్టీల శ్రేణులకూ మరింత స్పష్టత ఇస్తే మంచిదన్న అభిప్రాయం మూడు పార్టీల శ్రేణుల్లోనూ వ్యక్తమవుతుండడం గమనార్హం.
నామినేషన్ల ప్రసహనం కూడా దగ్గరకు వచ్చేస్తోంది. సమయం ఎక్కువ లేదు గనుక, కూటమిలో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మూడు పార్టీల అధినాయకత్వాలూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates