దేనికైనా రెడీ – కేటీఆర్

తెలంగాణ‌లో చిన్న‌సారుగా ప్ర‌చారంలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌.. పెద్ద స‌వాలే రువ్వారు. ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని, బీఆర్ ఎస్ పార్టీని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై కేటీఆర్ స్పందించారు. తాను ఈ విష‌యంలో నార్కో ఎనాలిసిస్ టెస్టుకు సిద్ధ‌మని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కుడు కిష‌న్‌రెడ్డి, ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డిలు కూడా సిద్ధ‌మేనా? అని గ‌ట్టి స‌వాల్ విసిరారు.

ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై స్పందించారు. త‌న‌కు ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉన్నా.. తాను నార్కో టెస్టుకు కానీ.. లై డిటెక్ట‌ర్ టెస్టుకు కానీ.. సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. అయితే.. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న కిష‌న్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలు కూడా సిద్ద‌ప‌డాల‌ని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం పెగాస‌స్‌ను జొప్పించి.. విప‌క్ష నేత‌ల ఫోన్ల‌ను విన‌లేదా? ఈ విష‌యం కిష‌న్‌రెడ్డికి తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు.

ఇక‌, త‌న మంత్రివ‌ర్గంలోని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ వంటి వారి పోన్ల‌ను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయించార‌ని కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు అంశాల‌పై వారు నార్కో కానీ.. లై డిటెక్ట‌ర్ టెస్టుల‌కు కానీ.. సిద్ధం కావాల‌ని.. అప్పుడే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయాల‌ని.. దేనికైనా తాను సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. అన‌వస‌ర‌పు విమ‌ర్శ‌ల‌తో ఈ ఇద్ద‌రు ప్ర‌జ‌ల అభివృద్దిని కావాల‌నే అడ్డుకుంటున్నార‌ని.. అధికారం ఇచ్చింది ఇందుకేనా? అని నిల‌దీశారు. మ‌రి చిన్న‌సారు స‌వాల్‌పై కిష‌న్‌రెడ్డి, రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.