ఆలు లేదు చూలు లేదు.. టెస్లాపై కామెడీ రాజ‌కీయం

ప్ర‌ఖ్యాత కార్ల త‌యీరీ సంస్థ టెస్లా ఇండియాలో ఓ ప్లాంటు పెట్టాల‌ని కొన్నేళ్ల నుంచి ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌య‌త్నాల‌ను ఇప్పుడు ముమ్మ‌రం చేసింద‌ని.. త్వ‌ర‌లోనే సంస్థ అధినేత‌ ఎలాన్ మ‌స్క్ ఆధ్వ‌ర్యంలో ఓ బృందం ఇండియాకు వ‌స్తుంద‌ని.. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ప్లాంటు పెట్టే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఐతే ప‌రిశీల‌న కోసం ఏపీకి రావ‌డం కూడా నిజ‌మో కాదో తెలియ‌దు. ఈలోపే టెస్లా ఏపీకి వ‌చ్చేసిన‌ట్లుగా అందుకు క్రెడిట్ తీసుకోవ‌డంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం దృష్టిసారించాయి. సామాజిక మాధ్య‌మాల్లో ఈ రెండు పార్టీల హ్యాండిల్స్‌లో పోస్టులు చూస్తే ఒకింత ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

వైసీపీ పోస్టు విష‌యానికి వ‌స్తే.. టెస్లా కంపెనీ బృందం త్వ‌ర‌లో ఏపీకి రాబోతోంద‌ని.. ఆ కంపెనీ ప్లాంటు పెట్ట‌డానికి ఏపీలో అనువైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని పేర్కొంటూ.. ఈ రాష్ట్రంలో ప్లాంటు పెట్టాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున టెస్లా సంస్థ‌కు ఆహ్వానం పంపిన‌ట్లు ముఖ్య‌మంత్రి ఫొటో పెట్టి పేర్కొన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఒక ఇన్విటేష‌న్ పంపినంత మాత్రాన ఏ కంపెనీ వ‌చ్చి ప్లాంటు పెట్టేయ‌ద‌న్న‌ది గ‌మ‌నించాల్సిన విష‌యం. ఆ సంస్థ‌కు అనువైన ప్రాంతం, రాయితీలు వ‌స్తాయ‌నుకుంటే వ‌చ్చి ప్లాంటు పెడ‌తారు. లేదంటే ప్ర‌భుత్వ బృందం రాయ‌బారం న‌డిపి సంస్థ‌ను ర‌ప్పించాలి. కానీ వైసీపీ వాళ్లు మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వం కృషితో ఏపీకి ఆల్రెడీ టెస్లా వ‌చ్చేసిన‌ట్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు.

ఇదే స‌మ‌యంలో టీడీపీ టీం అలెర్ట‌యింది. 2017లో చంద్ర‌బాబు టెస్లా అధినేత‌ను క‌లిసిప్ప‌టి ఫొటో షేర్ చేసి, అప్ప‌ట్లోనే ఏపీలో ప్లాంటు ఏర్పాటుకు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. త్వ‌ర‌లోనే త‌మ ప్ర‌భుత్వం రాగానే ఇక్క‌డ ప్లాంటు ఏర్పాటు ప‌నులు మొద‌ల‌వుతాయ‌ని పోస్ట్ చేశారు. టెస్లా ఒక‌వేళ ఏపీకి వ‌చ్చినా అది వైసీపీ ఘ‌న‌త కాదు, క్రెడిట్ త‌మ‌ది కాద‌ని చెప్పే ప్ర‌య‌త్నం టీడీపీ చేస్తోంది. ఐతే ఈ వ్య‌వ‌హారం చూస్తే జ‌నాల‌కు ఆలూ లేదు చూలు లేదు అన్న సామెత గుర్తుకు వ‌స్తోంది.