ప‌నిచేయండి.. ప‌ద‌వులు ప‌ట్టండి

ఏ రాజ‌కీయ పార్టీకైనా బ‌లం ఏదంటే.. కార్య‌క‌ర్త‌లే. పార్టీ క్యాడ‌ర్‌ను కాపాడుకుంటేనే మ‌నుగ‌డ ఉంటుంది. కానీ తెలంగాణ‌లో గ‌త ప‌దేళ్లుగా కాంగ్రెస్ ఈ ప‌ని చేయ‌లేక‌పోయింది. పార్టీలో అంద‌రూ సీనియ‌ర్ నాయ‌కులే కావ‌డంతో ప‌ద‌వుల కోసం వాళ్ల‌లో వాళ్లు కొట్టుకున్నారు. ఆధిప‌త్యం కోసం ప‌ట్టుబ‌డ్డారు. కానీ క్యాడ‌ర్‌ను మాత్రం ప‌ట్టించుకోలేదు. అయితే రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడు అయ్యాక ప‌రిస్థితి మారింది. పార్టీకి ఏది అవ‌స‌ర‌మో రేవంత్ అదే చేశారు. ప్ర‌జ‌ల్లోకి పార్టీని తీసుకెళ్లేది, ఓట్లు వేసేలా ప్ర‌భావితం చేసేది కార్య‌క‌ర్త‌లే. అందుకే వీళ్ల‌పై ఫోక‌స్ పెట్టి రేవంత్ సాగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనుకున్న ఫలితం సాధించారు. ఇప్పుడు కూడా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇచ్చేందుకు సాగుతున్నారు.

సీఎం అయిన త‌ర్వాత కూడా రేవంత్ అదే పంథాలో సాగుతున్నారు. పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుల కంటే కూడా కార్య‌క‌ర్త‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ఇటీవ‌ల జ‌న‌జాత‌ర స‌భ‌లోనూ ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ తెలంగాణ‌లో ఎక్కువ స్థానాలు గెలిచేలా మ‌రోసారి క్యాడ‌ర్‌ను రేవంత్ న‌మ్ముకున్నారు. ప‌ని చేయండి.. ప‌ద‌వులు ప‌ట్టండి.. అని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ఆఫ‌ర్ ఇస్తున్నారు. వచ్చే జూన్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు. ఇందులో పార్టీ త‌ర‌పున పోటీ చేసే ఛాన్స్ ద‌క్కించుకోవాలంటే ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నికల్లో ప‌ని చేయాల్సిందేన‌ని రేవంత్ తేల్చి చెప్పారు.

స‌ర్పంచ్‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని రేవంత్ పేర్కొన్నారు. జూన్‌లో అవి జ‌ర‌గ‌బోతున్నాయ‌ని అన్నారు. ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ప్ర‌భావం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా ఉంటుంది. అందుకే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయ‌కులు పెద్ద ఎత్తున ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే సిఫార్సులకు తావు లేకుండా క‌ష్ట‌ప‌డ్డ వాళ్ల‌కే ప్రాధాన్యం అనేలా రేవంత్ సాగుతున్నారు. పార్లమెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు బూత్‌ల వారీగా మెజారిటీ ప్ర‌కారం టికెట్లు ఇస్తామ‌ని రేవంత్ చెబుతున్నారు. అలాగే ఇందిర‌మ్మ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌కే ఇందులోనూ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు.