క‌న్న‌డ నేత‌లు కావాలంటోన్న ష‌ర్మిల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భావం చూపించేలా పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. బ‌స్సులో ప‌ర్య‌టిస్తూ రాజ‌న్న బిడ్డ‌ను ఆద‌రించండి అంటూ కాంగ్రెస్కు తిరిగి ఆద‌ర‌ణ సంపాదించే ప‌నిలో నిమ‌గ్న‌మయ్యారు. త‌న చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసును ప్రధాన ఆయుధంగా మార్చుకుని క‌డ‌ప ఎంపీ అవినాష్‌, సీఎం జ‌గ‌న్‌పై ష‌ర్మిల తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సొంత బాబాయ్‌ను హ‌త్య చేసిన వాళ్ల‌కు అన్న జ‌గ‌న్ అండ‌గా ఉంటున్నార‌ని ష‌ర్మిల నిల‌దీస్తున్నారు.

ఇలా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న ష‌ర్మిల మ‌రోవైపు అద‌న‌పు బ‌లాన్ని స‌మ‌కూర్చుకునే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ స్టార్ లీడ‌ర్ల‌ను తీసుకొచ్చి ఏపీలో ప్ర‌చారం చేయించాల‌నే ఆలోచ‌న‌లో ఆమె ఉన్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌, ఆయ‌న సోద‌రుడు, ఎంపీ డీకే సురేశ్‌తో ష‌ర్మిల ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. డీకే నివాసానికి వెళ్లి ఏపీ ఎన్నిక‌ల గురించి ష‌ర్మిల చ‌ర్చించార‌ని స‌మాచారం. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డంతో పాటు తెలంగాణ‌లోనూ పార్టీ గెలిచేలా డీకే శివ‌కుమార్ కీల‌కంగా వ్యవ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ పార్టీ పుంజుకునే విధంగా ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు, ప్లాన్ గురించి ష‌ర్మిల చ‌ర్చించిన‌ట్లు తెలిసింది.

ఇక ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌ర్ణాట‌క నుంచి ప్రముఖ నేత‌ల‌ను రంగంలోకి దించేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ విష‌యం గురించి డీకేతో ఆమె మ‌ట్లాడిన‌ట్లు తెలిసింది. కొన్ని ప్ర‌తిపాద‌న‌లు కూడా చేశార‌ని స‌మాచారం. ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేనూ క‌లిసిన ష‌ర్మిల ఏపీ ఎన్నిక‌ల గురించి చ‌ర్చించారు. అయితే ఇప్ప‌టికే క‌ర్ణాట‌క నుంచి ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనేందుకు 10 మంది నేత‌ల జాబితాను సిద్ధం చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఓట‌ర్ల‌పై ప్ర‌భావం చూపే నేత‌ల కోసం ష‌ర్మిల మ‌రోసారి చ‌ర్చించిన‌ట్లు టాక్‌.