జనసేన వాహనంపై టీడీపీ అధినేత

వారాహి అన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు మాత్ర‌మే. గ‌త ఏడాది జూన్‌లో ఈ వారాహి వాహ‌నాన్ని ప‌వ‌న్ ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చారు. ఈ వాహ‌నం శ‌త్రు దుర్బేధ్యం. పైగా విశాలంగా ఉండి.. నాయ‌కులు ప్ర‌సంగించేందుకు వీలుగా ఉంటుంది. వాహ‌నానికి చుట్టూ మైకులు ఉంటాయి. అదేవిధంగా లైటింగ్ కూడా ఉంటుంది. ఇక‌, పంక్ఛ‌ర్ ఫ్రీ టైర్లు, 100 కిలోల బ‌లంతో కొట్టినా ప‌గిలిపోని అద్దాలు వంటివి ఈ వాహ‌నం ప్ర‌త్యేక‌త‌లు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ మాత్ర‌మే ఈ వాహ‌నాన్ని వినియోగిస్తూ వ‌చ్చారు.

కానీ, తొలిసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు వారాహి వాహ‌నాన్ని వినియోగించారు. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నిర్వ‌హించిన ఉమ్మ‌డి రెండో స‌భ‌ను ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని నిడ‌ద‌వోలులో బుధ‌వారం రాత్రి నిర్వ‌హించారు. దీనికి ముందు త‌ణుకులో కూడా నిర్వ‌హించినా.. అక్క‌డ‌కు వారాహి వాహ‌నం రాలేదు. దీనికి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని స‌మాచారం. దీంతో నిడ‌ద‌వోలులో నిర్వ‌హించిన ఉమ్మ‌డి పార్టీల స‌భ‌లో వారాహి వాహ‌నం ప్ర‌త్యేకంగా క‌నిపించింది. తొలిసారి మాజీ సీఎం చంద్ర‌బాబు ఈ వాహ‌నంపైకి ఎక్కి మురిసిపోయారు.

“వారాహి వాహ‌నం పేరు విన‌డం.. వీడియోలు.. ఫొటోల్లో చూడ‌డ‌మే త‌ప్ప‌.. ప్ర‌త్య‌క్షంగా ఈ వాహ‌నాన్ని చూసింది లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ నాకు అనేక మార్లు ఈ వాహ‌నం గురించి వివ‌రించారు. ప్ర‌త్యేక‌త‌లు చాలానే ఉన్నాయ‌ని చెప్పారు. కానీ, ఇప్పుడే ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నా. వాహ‌నం చాలా బాగుంది” అని చంద్ర‌బాబు ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక‌, ఈ వాహ‌నంపై ముగ్గురు నాయ‌కులు ప్ర‌సంగించారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి నిడ‌ద‌వోలు స‌భ‌లో పాల్గొన్నారు. ఇక‌, ప‌వ‌న్ అటు త‌ణుకు, ఇటు నిడ‌ద‌వోలు స‌భ‌ల్లోనూ పాల్గొని ప్ర‌సంగించారు. మూడు పార్టీల‌తోనే అభివృద్ది అని.. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారుతో రాష్ట్రం ప‌రుగులు పెడుతుంద‌ని నాయ‌కులు తేల్చి చెప్పారు.