ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మెడకు పింఛన్ల పంపిణీ వ్యవహారం చుట్టుకుంటోంది. ఏకంగా ఆయనను సైతం బదిలీ చేసినా.. ఆశ్చర్యపోలేని పరిస్థితులు తెరమీదికి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో ఇదే చర్చ సాగుతుండడం గమనార్హం. ఈ నెల(ఏప్రిల్) సామాజిక భద్రతా పింఛన్ల వ్యవహారం రాజకీయంగా కాకరేపిన విషయం తెలిసిందే. ప్రతినెలా వలంటీర్లు పింఛను దారుల ఇంటికి వెళ్లి ఇస్తున్నారు. అయితే.. ఇలా వెళ్లిన వారు.. రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్‌డీ) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఇక, ఇదేసమయంలో ఏపీ హైకోర్టు కూడా దీనిపై సీరియస్ అయింది. అయితే.. నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వదిలేసింది. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ సహా పథకాలకు సంబంధించిన పనులను వలంటీర్లకు అప్పగించరాదని.. గత నెల 30న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. వలంటీర్ల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పింఛన్ల పంపిణీకి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించింది. అంతేకాదు.. నడవలేని వారు, మంచంలో రోగంతో ఇబ్బంది పడుతున్నవారు, గర్భిణులు తదితరులకు ఇంటి వద్దే పింఛన్లు అందించాలని పేర్కొంది.
కానీ, ఈ వ్యవహారాన్ని అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుందనే విమర్శలు వచ్చాయి. ఒకవైపు ఎండలు మండి పోతున్నా.. లబ్దిదారులను సుదూర ప్రాంతాలు నడిపించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇక, ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాప్యం చేశారన్నది టీడీపీ నేతల విమర్శ. అంతేకాదు.. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు కూడా ఇంటికి వెళ్లి పింఛను అందించకుండా.. వారు రోడ్లపైకి వచ్చి ఎండ వేడమికి అల్లాడిపోయేలా చేశారని.. దీనికి కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శేనన్నది టీడీపీ ఆరోపణ. ఈ క్రమంలో 31 మంది వృద్ధులు చనిపోయారని పేర్కొంది.
ఇదే విషయాన్ని ఫిర్యాదు రూపంలో టీడీపీ నేతలు.. తాజాగా జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. ఇంత మంది మరణించడానికి కారణం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శేనని.. ఆయనను తక్షణం ఆ సీటు నుంచి బదిలీ చేసి.. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. దీనిని హక్కుల సంఘం విచారణకు తీసుకుంది. దీనిపై సమాధానం చెప్పాలని.. విచారణకు ఎందుకు ఆదేశించ కూడదో వివరణ ఇవ్వాలని తాజాగా ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇంకా స్పందించలేదు. దీనిపై కనుక కఠినంగా స్పందిస్తే.. జవహర్ రెడ్డి బదిలీ ఖాయమని అంటున్నారు టీడీపీ నాయకులు.