కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ.. వైసీపీకి భారీ షాక్ తగిలింది. నిన్న మొన్ననే.. సీఎం జగన్.. ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తున్న పార్టీ కీలక నాయకురాలు.. బీసీ మహిళ బుట్టా రేణుకను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బుట్టమ్మ ఆస్తులు కూడా అంతంత మాత్రమే
అన్నారు. అయితే.. ఆ అంతంత మాత్రం ఆస్తులు ఎంతెంత ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. మెరిడియన్ స్కూల్ పేరుతో హైదరాబాద్‌లో విద్యావ్యాపారం సహా.. కల్యాణ మండపాలు కూడా కట్టించారు.
ఇవి కాక..గుర్రాలరేసుల్లోనూ పెట్టుబడులు పెట్టారు. సరే.. ఇవన్నీ ఎలా ఉన్నా..ఇప్పుడు బుట్టా రేణుకకు భారీ షాక్ ఇస్తూ.. ఆమె ఆస్తులను వేలం వేసేందుకు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ రెడీ అయింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మిగనూరులోనే కాకుండా.. వైసీపీలోనూ కలకలం రేగింది. బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న ఈ-వేలం వేయనున్నట్లు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది.
వ్యాపార అవసరాల నిమిత్తం ఈమె కొన్నేళ్ల కిందట ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ.340 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. కొవిడ్ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతినగా, కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం బుట్టా ఇన్‌ఫ్రాతోపాటు ఇతర సంస్థలపై పడింది. రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది.
బకాయిల చెల్లింపు అంశంపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఉంది. ఈ నేపథ్యంలో వేలం ప్రకటన ఇవ్వడం గమనార్హం. విషయం ఎన్సీఎల్టీలో ఉండగా వేలం ప్రకటన విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే.. ఎగవేస్తారన్న వాదన బలంగా వినిపించినప్పుడు.. వేలం వేసే అధికారం ఆర్బీఐ ఆర్థిక సంస్థలకు కల్పించింది.