కీలకమైన ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజు లుగా ఆయన ఆరోగ్యం నలతగా ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ఆయన పిఠాపురంలో పర్యటిం చి.. సభలు, సమావేశాలు, పాదయాత్రతో తీరిక లేకుండా గడిపారు. దీంతో ఆ అస్వస్థత తీవ్ర జ్వరానికి దారి తీసింది. దీంతో ప్రచారాన్ని రద్దు చేసుకుని ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో పిఠాపురంలో ప్రచార బాధ్యతలను టీడీపీ ఇంచార్జ్ సత్యనారాయణ వర్మ తీసుకున్నారు.
ఇక, షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి పవన్ కల్యాణ్.. పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేయాల్సి ఉంది. రోడ్ షోలు, బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేశారు. అయితే.. పవన్ అస్వస్థతకు గురై హైదరాబాద్‌కు వెళ్లిపోవడంతో.. తెనాలి షెడ్యూల్ను కూడా జనసేన రద్దు చేసింది. పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ కార్యాలయం వెల్లడించింది. దీంతో ఆయన నాలుగు రోజుల వరకు.. పర్యటనలకు దూరంగా ఉంటారని పేర్కొంది.
పిఠాపురంలో మండుటెండలో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారని పార్టీ వర్గాలు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన… చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారని పేర్కొన్నాయి. దీంతో, ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడిందని, అయితే.. నాలుగు రోజుల్లో తిరిగి వస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి శుక్రవారం నుంచి నెల్లిమర్ల సహా జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో పవన్ పర్యటించాల్సి ఉంది. ఇప్పుడు వాటిని కూడా రీషెడ్యూల్ చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.