మారిన మనిషి: పిఠాపురంలో సరికొత్త పవన్ కళ్యాణ్.!

2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండిట్లోనూ ఓటమి చవిచూశారు. కారణమేంటి.? రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. 130కి పైగా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. అటు భీమవరంలో, ఇటు గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటింటి ప్రచారం చేయడానికి వీలు కాలేదు.

కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. టీడీపీ – బీజేపీ.. ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది జనసేన. మొత్తంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనసేనాని పోటీ చేస్తున్నారు.. అదే పిఠాపురం.

ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి అవకాశం దొరుకుతోంది. జనంతో మమేకమవుతున్నారు. వారి కష్టాల్ని తెలుసుకుంటున్నారు. నియోజకవర్గ సమస్యల గురించి అవగాహన కల్పించుకుంటూ, ప్రజలకు భరోసా ఇవ్వగలుగుతున్నారు.

వాస్తవానికి, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. అయితే, సొంత నియోజకవర్గాలపై ఫోకస్ తగ్గిపోయింది. పార్టీ నిర్మాణం అప్పటికి సరిగ్గా జరగలేదు. గ్రామ స్థాయిలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేందుకు సరైన నాయకులూ అప్పట్లో లేరు. ఇప్పటి పరిస్థితి వేరు.

‘పవన్ కళ్యాణ్ రావాల్సిన పనిలేదు.. మేమే గెలిపించుకుంటాం ఆయన్ని.. మేమే ప్రచారం సంగతి చూసుకుంటాం..’ అని జనసైనికులు, పిఠాపురంలో ముందు నుంచీ నినదిస్తున్నారు. టీడీపీ మద్దతు కూడా వుండడంతో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ కళ్యాణ్‌కి పూర్తి మద్దిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని గెలిపించే బాధ్యత తనదేనని అంటున్నారు.

వెరసి, పిఠాపురంలో సరికొత్త పవన్ కళ్యాణ్‌ని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. అన్ని మతాల విశ్వాసాల్ని గౌరవిస్తూ, పవన్ కళ్యాణ్ అందర్నీ కలుపుకుపోతున్న తీరు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆకట్టుకుంటోంది.