“99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్.. పరీక్షలకు భయ పడతాడా” అని వైసీపీ అధినేత, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మేమంతా సిద్ధం పేరుతో గత కొన్నిరోజులుగా ప్రచారం చేస్తున్న ఆయన తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రసంగించారు. ప్రస్తుత ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తున్నానని చెప్పిన జగన్.. విపక్షాల్లో ఆ ధైర్యంలేదని.. అందుకే కలిసి తనపైకి పోటీ పడుతున్నాయని చెప్పారు. అయితే.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం తనకు ప్రజలే ఇచ్చారని చెప్పారు. 99 మార్కులు తెచ్చుకన్న విద్యార్థి.. పరీక్షలకు భయపడతాడా? అని ప్రశ్నించారు.
ఇదేసమయంలో విపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. తనపై ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదని అన్నారు. అధికారం కోసం గుంపులుగా, తోడేళ్ల మందలా, జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తున్నారని విమర్శించారు. జెండాలు జతకట్టడమే వారి పని అని, మీ గుండెల్లో గుడికట్టడమే జగన్ చేసిన పని అని సీఎం వ్యాఖ్యానించారు.
మీ బిడ్డ ప్రతి గుండెలో ఉన్నాడు. మీ గుండెల్లో మన ప్రభుత్వం ఉంది. ఇవాళ మీ బిడ్డ ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి. ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ.... ఇంతమంది ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు కుట్రపూరితంగా ఏకమవుతున్నారు. కానీ వారందరికీ తెలియని విషయం ఒకటుంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటు, గతంలో పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ ఈసారి పరీక్ష పాసవుతా డా? మేనిఫెస్టోను బైబిల్ గానూ, ఖురాన్ గానూ, భగవద్గీతగానూ భావించి 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు, 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చని మోసకారి బాబు, ఆయన కూటమి ఈసారి నిలబడగలుగుతుందా? అని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి వైసీపీ అభిమానులు కానీ, పార్టీ నేతలు కానీ, వలంటీర్లు కానీ, ఇంటింటా అభివృద్ధి అందుకున్న పేదలు కానీ.. వీరిలో ఏ ఒక్కరైనా భయపడతారా? అని జగన్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనం ఎలా సిద్ధం అయ్యామంటే.. ఇంటింటికీ అందితే నే అది సంక్షేమం అని చూపించాం కాబట్టి, గ్రామానికి మంచి చేయడం అంటే ఇదీ అని చూపించాం కాబట్టి, మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు కాబట్టి, గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు… వారికి జరగాల్సిన మంచి వారికి జరగాలి అని వారికి సంక్షేమం అందించాం కాబట్టి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates