మొత్తానికి పొత్తు పనిచేయడం మొదలైందా

కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటున్నాయి. లేదులేదంటూనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే వైసీపీ స‌ర్కారుకు గుండెకాయ వంటి వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఎన్నిక‌ల‌కు దూరంగా పెట్టింది. వీరిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌లకు దూరంగా ఉంచాల‌ని.. ఎలాంటి విధులూ అప్ప‌గించ‌రాద‌ని కూడా పేర్కొంది. దీంతో అత్యంత కీల‌క‌మైన సమ‌యంలో వైసీపీకి వ‌లంటీర్లు దూర‌మ‌య్యారు.

ఇక‌, వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్పీప్ చేసిన నెల్లూరు జిల్లా స‌హా.. గుంటూరు, ప‌ల్నాడు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల ఎస్పీ ల‌ను కూడా తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ చేసేసింది. వీరిపై వైసీపీ అనుకూల ముద్ర ఉండ‌డం తెలిసిందే. వారిని త‌క్ష‌ణ మే విధుల నుంచి తొల‌గించాల‌ని.. ఎన్నిక‌ల‌తో ఏమాత్రం సంబంధం లేని విధులు అప్ప‌గించాల‌ని.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదే శించింది. ఇది కూడా ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి భారీ ఎఫెక్ట్ ప‌డ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది.

ఇక‌, ఇప్పుడు పెద్ద త‌ల‌కాయ‌ల‌పైనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ఏకంగా రాష్ట్ర డీజీపీ క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డిల‌ను కూడా ఒక‌టి రెండు రోజుల్లో బ‌దిలీచేసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని సీనియ‌ర్ అధికారుల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రిలో డీజీపీ నేరుగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన వారు. దీంతో ఆయ‌న ప్ర‌భావం ఎన్నిక‌ల‌పై ఉంటుంద‌ని ప్ర‌తిప‌క్షాలు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశాయి. దీంతో ఆయ‌న మార్పు త‌థ్య‌మ‌ని అంటున్నారు.

ఇక‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డిపైనా క‌త్తి వేలాడుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈయ‌న‌ను కూడా ప్రాధాన్యం లేని పోస్టుకు బ‌దిలీ చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. మ‌రోవైపు.. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఐఏఎస్ అధికారి ప్ర‌వీణ్ ప్రకాష్‌కు ఇప్ప‌టికే హైకోర్టు త‌లంటేసింది. దీంతో ఆయ‌న‌ను త‌ప్పించే అవ‌కాశం ఉంది. ఇక‌, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శ్రీల‌క్ష్మిపైనా బ‌దిలీ క‌త్తి వేలాడుతోంద‌ని స‌మాచారం. మొత్తంగా 5 నుంచి ఆరుగురు కీల‌క ఐఏఎస్‌ల బ‌దిలీ త‌థ్య‌మ‌ని అంటున్నారు.