ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ నాయకుడు, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు .. సొంత నేత నుంచి సెగ తగులుతోంది. వైసీపీకి చెందిన గాంధీ అనే వ్యక్తి.. టికెట్ ఆశించారు. అది రాకపోవడంతో ఆయన పార్టీకి దూరమై.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో ఆముదాల వలస రాజకీయం.. సెగ పుట్టిస్తోంది. గాంధీతోపాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వైసీపీ తరపున తమ్మినేని సీతారాం మరోసారి ఆమదాలవలస నుంచి బరిలోకి దిగుతున్నారు. 10వ సారి ఆయన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ పడుతున్నారు. ఆయన స్పీడ్ కి అడ్డుకట్టు వేసేందుకు టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అటు తమ్మినేని సీతారాం ఇటు కూన రవికుమార్ లు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీలో ఉంటూ ఆ పార్టీలో జరిగిన అవమానాలతో రాజీనామా చేసిన సువ్వారి గాంధీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి సిద్ధమయ్యారు.
ముగ్గురు నాయకులు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మినేని సీతారాం ఆమదాలవలస సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికలలో ఆయన తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ను బరిలోకి దింపాలని భావించారు. అయితే పార్టీ అధినేత జగన్ సీతారాంనే పోటీ చేయాలని స్పష్టం చేయడంతో ఆయన బరిలో నిలిచారు.
కూటమి అభ్యర్ధిగా బరిలో నిలుస్తున్న కూన రవికుమార్ కూడా గ్రామాలలో తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్ళి విస్తృత ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆయన వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారని ప్రజలకి వివరిస్తున్నారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలపై భారాలను మోపారని, చార్జీల మోత మ్రోగించారని తెలియజేస్తున్నారు. ఉమ్మడి ప్రభుత్వం రావాలని కూన రవికుమార్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన పొందూరు మండలానికి చెందిన నాయకుడు సువ్వారి గాంధీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. తన అనుయాయులు, మద్దతుదారులతో సమాలోచనలు చేసిన ఆయన నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని సువ్వారి గాంధీ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఢీ కొట్టేందుకు గాంధీ తన మద్దతుదారులతో ప్రచారం సాగిస్తున్నారు. దీంతో ఆముదాలవలసలో ఓట్ల చీలికలు పెరిగే అవకాశం ఉంది. మరి ఇది ఎవరికి కలిసి వస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates