వంగవీటి రాధా. ఈ పేరు చెబితే చాలు ఆయనకు పరిచయం అక్కర్లేదు. అలాంటి నాయకుడు ఇప్పుడు కీలకమైన ఎన్నికల వేళ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన ఇప్పుడు అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి అధికారికంగా ఆయన టీడీపీలోనే ఉన్నారు. కానీ, అలా ఆ పార్టీ క్లెయిమ్ చేసుకోవడంలేదు. అసలు పార్టీలో రాధా పేరు తలుచుకునేవారు కూడా లేరు. అంతేకాదు.. అసలు రాధా గురించిన చర్చకూడా జరగడం లేదు.
దీనికి కారణం.. ఆయన టీడీపీ నేతలతో కాకుండా.. వైసీపీ నాయకులతో రెండేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరగడమే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకుటుంబాన్ని దూషించిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో ఆయన తరచుగా ఫొటోలకు ఫోజులిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో చంద్రబాబు పైకి చెప్పకపోయినా.. ఆయనను పార్టీలో దూరం పెట్టారు. ఇక, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన టికెట్ అడిగింది లేదు.. పార్టీ ఇచ్చిందీ లేదు.
మరోవైపు జనసేనలో చేరుతున్నారంటూ.. వంగవీటి రాధాపై ప్రచారం జరిగింది. అది కూడా సాకారం కాలేదు. రెండు రోజుల కిందట మచిలీపట్నం ఎంపీ, కాపు నాయకుడు వల్లభనేని బాలశౌరితో కలిసి పలు కార్యక్రమాల్లో రాధా పాల్గొన్నారు. దీంతో రాధాకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. వాస్తవానికి జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో నిన్నటి వరకు 18 స్థానాలు ప్రకటించారు. తాజాగా ఒక స్థానం ప్రకటించారు.
మరో రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అవనిగడ్డ కూడా ఉంది. అయితే.. అందరూ చెబుతున్నట్టుగా రాధా పేరు అయితే.. జనసేన ఎక్కడా పరిశీలనలో తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఈ సీటును టీడీపీ నాయకుడు, సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. దీంతో రాధా పరిస్థితి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. ఇదే జరిగితే.. రెండు ఎన్నికల్లో ఆయనకు టికెట్ లేకుండా పోయినట్టు అవుతుందనిపరిశీలకులు చెబుతున్నారు. రంగా వారసుడిగా ఆయన విఫలమయ్యారని కాపు నాయకులే చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates