ఏపీ సీఎం జగన్ పర్యటనలో ఘోర అవమానం ఎదురైంది. ఇప్పటికే కర్నూలులో ఎన్నికల ప్రచారం నిమిత్తం పర్యటించిన సీఎం జగన్‌కు మహిళలు ఖాళీ బిందెలతో ఎదురొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. తాజాగా మరో ఘోరం చోటు చేసుకుంది. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న హై సెక్యూరిటీ బస్సుపైకి ఆగంతుకుడు చెప్పులు విసిరాడు.
అనంతపురం జిల్లాలో సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గుంతకల్లు లోని ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఇక్కడి నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రయాణం చేస్తున్న బస్సును ఆపి.. పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోయారు. తొలుత ఆయన ఈ ప్రచారానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో అనూహ్యంగా సీఎం జగన్‌ను కార్నర్ చేసుకుని గుంపులోని ఓ వ్యక్తి రెండు చెప్పులు బలంగా విసిరాడు.
దీంతో ఆ రెండు చెప్పుల్లొ ఒకటి బస్సు సైడ్ అద్దాన్ని తాకి కింద పడిపోగా.. రెండో మాత్రం జగన్ కుడి పక్కగా దూసుకుంటూ వెళ్లి సెక్యూరిటీ సిబ్బందికి తగిలింది. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కానీ, చెప్పులు విసిరిన వ్యక్తిని మాత్రం గుర్తించలేక పోయారు. ఇదిలావుంటే, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం .. జొన్నగిరిలోనూ జగన్ యాత్రకు నిరసన సెగ భారీగా తగిలింది.
ఇక్కడ వందల సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు.. తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలతో వచ్చిన మహిళలను పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. అయినప్పటికీ మహిళలు పోలీసులు ఏర్పాటు చేసిన కంచెను దాటుకుని సీఎం ప్రయాణిస్తున్న బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.