స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన కడియం శ్రీహరి రాజకీయాలు..ఢిల్లీకి చేరుకున్నాయి. తన కుమార్తె, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం కావ్యతో కలిసి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు లేదా.. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో కావ్య లేదా కడియంకు వరంగల్ పార్లమెంటు సీటును కేటా యించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం.. తొలుత టీడీపీతో తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు.
తర్వాత.. బీఆర్ ఎస్‌లో చేరారు. ఇక్కడే డిప్యూటీ సీఎం పదవిని కూడా అందుకున్నారు. తర్వాత రాజయ్యకు శ్రీహరికి వివాదం తలెత్తినప్పుడు కూడా కేసీఆర్.. శ్రీహరి పక్షానే ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె కావ్యకు టికెట్ ఇవ్వాలన్న శ్రీహరి అభ్యర్థనను కూడా కేసీఆర్ మన్నించారు. ఇక, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆమెకు వరంగల్ టికెట్ ఇచ్చారు. అయితే.. ఇంత చేసినా.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్లను కడియం శ్రీహరి కాదనలేకపోయారు.
పార్టీ పరిస్థితి బాగోలేదంటూ.. వరంగల్ టికెట్ ను నిరాకరించిన కావ్య.. తన ఎమ్మెల్యే పదవిని మాత్రం వదులుకోకుండా.. ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్‌లోకి టచ్‌లోకి వెళ్లిన ఈ కుటుంబం.. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనేందుకురెడీ అయింది. ఈ క్రమంలో దాదాపు కావ్యకే వరంగల్ పార్లమెంటు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు.. కడియం వర్గంగా ఉన్న 100 మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచా రం. మొత్తంగా వరంగల్‌లో బీఆర్ ఎస్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి వీటిని ఎలా ఛేదిస్తారో చూ డాలి. ఇంకోవైపు.. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సిరిసిల్ల రాజయ్య.. కూడా బీఆర్ ఎస్‌కు దూరమయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పంచనే చేరారు. దీంతో నిన్నటి వరకు బీఆర్ ఎస్ కారు రయ్యన తిప్పిన ఇద్దరు నాయకులు కూడా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.