పోలీసులు నా హక్కులు కాలరాస్తున్నారు: క‌విత

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌రు కుంభ‌కోణంలో ప్ర‌ధాన నిందితురాలిగా ముద్ర‌ప‌డిన తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. 14 రోజుల పాటు ఆమెకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జైలు విధించింది. ఈ క్ర‌మంలో క‌విత మూడు రోజులు గా జైల్లోనే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆమె జైలు అధికారుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తీహార్ జైలు అధికారులు త‌న‌ హక్కులకు భంగం కలిగిస్తున్నారని, కోర్టు ఆదేశాలేవీ పాటంచడం లేదని క‌విత పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఆమె ప్ర‌త్యేకంగా గురువారం సాయంత్రం రౌస్ అవెన్యూ కోర్టులోనే ప్ర‌త్యేక అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. “జైలు అధికారులు నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. క‌నీస గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేదు. కోర్టు ఆదేశాల‌ను ఏమాత్రం పాటించ డం లేదు” అని త‌న అఫిడ‌విట్‌లో క‌విత పేర్కొన్నారు. అంతేకాదు.. కోర్టు త‌న‌కు ఇంటి భోజ‌నం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్ షీట్స్‌, బుక్స్‌, క‌ళ్ల‌జోడు, మందులు ఇవ్వాల‌ని ఆదేశించిన విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావించారు.

అయితే.. కోర్టు ఆదేశించిన‌ట్టు పోలీసులు త‌న‌కు ఒక్కటంటే ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేద‌ని క‌విత పేర్కొన్నారు. “క‌నీసం క‌ళ్ళ‌జోడు కూడా ఇవ్వ‌లేదు. పెన్ను… పేప‌ర్లు అడిగితే.. నీకెందుకంటూ.. అగౌర‌వంగా మాట్లాడుతు న్నారు. ఇంటి నుంచి భోజ‌నం కూడా తెచ్చుకోనివ్వ‌డం లేదు“ అని క‌విత త‌న అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. త‌న‌ను అగౌర‌వ ప‌రిచిన జైలు అధికారుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును కోరారు. అంతేకాదు.. సూప‌రింటెండెంట్‌పై నా చ‌ర్య‌ల‌కు ఆదేశించాల‌ని అభ్య‌ర్థించారు. ఈ పిటిష‌న్ శ‌నివారం విచార‌ణ‌కు రానుంది.