కరోనా వైరస్ కు విరుగుడుగా మనదేశంలో జరుగుతున్న పరిశోధనలు ఫలితాలనిస్తే వచ్చే ఏడాదిలో మందు తయారయ్యేట్లుంది. ఈ విషయాన్ని కేంద్రం ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
మనదేశంలో వైద్య నియంత్రణ సంస్ధ ఐసిఎంఆర్ అనుమతులు తీసుకుని అనేక ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ కనిపిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో ముంబాయ్, హైదరాబాద్, పూనా లాంటి నగరాల్లోని వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు ఇదే పనిమీద 24 గంటలూ పని చేస్తున్నారు.
మనదేశంలో జరుగుతున్నట్లే యావత్ ప్రపంచం కూడా అనేక పరిశోధనలు చేస్తున్నాయి. రష్యా, అమెరికా, బ్రిటన్ లోని కంపెనీలు వ్యాక్సిన్ కనుగొనటంలో ముందజంలో ఉన్నాయి. ఇందులో భాగంగానే రష్యాలో స్పుత్నిక్ పేరుతో కరోనా వ్యాక్సిన్ తయారైంది.
దీన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆయన కూతురు తదితరులపై ఇప్పటికే ప్రయోగించిన విషయం అందరికీ తెలిసిందే. సరే రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ పై అమెరికా తదితర దేశాల్లో కొంత గందరగోళం ఉన్నా రష్యా మాత్రం తన పంథాలో ముందుకెళిపోతోంది. అందుకనే రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ ను మనదేశంలో ప్రయోగించే విషయంలో ఆలోచన చేస్తున్నారు.
ఇదే విషయమై హర్షవర్ధన్ మాట్లాడుతూ విదేశాల వ్యాక్సిన విషయాన్ని పక్కనపెట్టేసి మన కంపెనీలే వ్యాక్సిన్ తయారీలో స్పీడుగా ఉన్నట్లు చెప్పారు. బహుశా వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ లోపల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తానే మొదటి వ్యాక్సిన్ వేసుకోవటానికి కూడా మంత్రి రెడీ అయిపోయారు.
కరోనా వారియర్స్ , వృద్ధులకు వ్యాక్సిన్ వేయటంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు కూడా చెప్పారు. వ్యాక్సిన్, ధర, సరఫరా, ఉత్పత్తి తదితర అంశాలపై ప్రత్యేక కమిటి చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మంత్రి జోరు చూస్తుంటే వ్యాక్సిన్ వచ్చే ఏడాది వచ్చేది ఖాయమనే నమ్మకం పెరిగిపోతోంది. అదే నిజమైతే అంతకన్నా కావాల్సిందేముంది.