పీ-గ‌న్న‌వ‌రం, పోల‌వ‌రం.. జ‌న‌సేన‌కే!

ఏపీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని వెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం స‌హా కీల‌క‌మైన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం పోల‌వ‌రం కూడా జ‌న‌సేన ఖాతాలోకే చేరాయి. వాస్త‌వానికి పీ. గ‌న్న‌వ‌రంలో తొలుత టీడీపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. తాజాగా ఈ సీటు జనసేనకు మారింది. తొలి విడత టీడీపీ జాబితాలో ఆ పార్టీ నేత మహాసేన రాజేశ్ కు(యూట్యూబ‌ర్‌గా గుర్తింపు పొంది.. రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డంతో గుర్తింపు పొందారు) చంద్రబాబు ఈ టికెట్ కేటాయించారు. అయితే.. దీనిపై తీవ్ర‌స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గంలో విమ‌ర్శ‌లు, నిర‌స‌న‌లు పెల్లుబికాయి.

దీంతో ఈ సీటులో చంద్ర‌బాబు జోక్యం చేసుకోకుండా.. వెంట‌నే దీనిని ప‌వ‌న్ ఖాతాలో ప‌డేశారు. దీంతో తాజాగా పవన్ కల్యాణ్ ఇదే స్థానం నుంచి తన పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించారు. ఈ స్థానంలో గిడ్డి సత్యనారాయణ జనసేన నుంచి పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు. ఈయన హైదరాబాద్ లో పోలీస్ అధికారిగా పని చేశారు. అనంతరం జనసేనలో చేరారు. పి.గన్నవరం నియోజకవర్గంలో తొలుత టీడీపీ నేత మహాసేన రాజేశ్ కు టికెట్ కేటాయించారు. దీనిపై టీడీపీ, జనసేనలో కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో మార్పు త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అలాగే, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ – బీజేపీ – జనసేనల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు జనసేన నేత నాగబాబు ఆయనకు పత్రాలను అందజేశారు. ఇక్కడ అందరినీ కలుపుకొని పని చేస్తానని.. 3 పార్టీల నేతలు, కార్యకర్తల సమన్వయంతో పోలవరంలో భారీ మెజార్టీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున బొరగం శ్రీనివాస్(2019లో ఓడారు), ముడియం శ్రీనివాస్‌(2014లో గెలిచారు) కూడా టికెట్ ఆశించారు. వారికి ఇవ్వ‌కపోవ‌డం గ‌మ‌నార్హం.

పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. పి.గన్నవరం జనసేన నేతలంతా వాటన్నింటినీ తట్టుకుని ఒకే మాట మీద నిలబడ్డారు. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలిసి సత్తా చాటారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర దిశ దశను నిర్దేశించేవి. పోటీ చేసే ప్రతీ స్థానం కీలకమే. పి.గన్నవరంలో జనసేన కచ్చితంగా గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.