ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆయా పార్టీలకు పోగా.. 144 అసెంబ్లీ స్థానాలను తన దగ్గర ఎట్టుకున్నారు. ఈ క్రమంలో తొలి విడతలోనే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మలి విడతలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక, తాజాగా 11 మందిని ప్రకటించారు అయితే.. మొత్తం 144లో ఇప్పటి వరకు 139 మందిని ప్రకటించినట్టు అయింది.
దీంతో ఐదుగురిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఆలూరును ముందు ప్రకటించి.. తర్వాత వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ఆ ఆరు ఎందుకు ఆపారు? అనే చర్చ తమ్ముళ్ల మధ్య జోరుగా సాగుతోంది. ఏదైనా వ్యూహం ఉందా? అనేది తమ్ముళ్ల తర్జన భర్జన.
భీమిలి రగడ అంతా ఇంతా కాదు!
- విశాఖలోని కీలకమైన నియోజకవర్గం భీమిలి టికెట్ కోసం ఒకరికిమించి ఎక్కువగా నేతలు ఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. అయితే. చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచి బరిలోకి దించాలని చెబుతున్నారు.
- మరో వైపు చీపురుపల్లి టికెట్ ను మాజీ మంత్రి కళా వెంకటరావు ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ తర్జన భర్జన ఏర్పడింది. ఇక, ఎచ్చెర్ల సీటును బీజేపీకి కేటాయించడంతో తాను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తానని కళా వెంకటరావు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే భీమిలితో పాటు అటు చీపురుపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం.
- ఇక, నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడం, అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించడం కూడా అయిపొయింది. కానీ, అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ బంగార్రాజుకు భీమిలి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
- ప్రకాశం జిల్లా దర్శి టికెట్ పై పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దర్శి టికెట్ ఇస్తే టీడీపీ కండువా కప్పుకుంటానని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. అయితే, ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉండడంతో పక్కన పెట్టారు. ప్రస్తుతం ఈయన వైసీపీలో ఉన్నారు. కానీ, టికెట్ మాత్రం దక్కలేదు.
- అనంతపురం అర్బన్ టికెట్ ను తొలుత జనసేనకు ఇవ్వాలని అనుకున్నారు. కానీ, ఆ పార్టీ వద్దన్నట్టు సమాచారం. దీంతో టీడీపీ నేత, ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు, మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు.
- రాజంపేట టికెట్ కోసం చెంగల్రాయుడు, జగన్మోహన్‌రాజు పోటీ పడుతున్నారు.
- గుంతకల్లు టికెట్ ఇచ్చే హామీతో వైసీపీ నేత గుమ్మనూరు జయరాం తన మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరారు. అయితే, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, మరో సీనియర్ నేత సై.. అంటున్నారు. దీంతో గుమ్మనూరు ఫ్యూచర్ సమస్యలో పడింది. ఇలా.. మొత్తంగా 6 నియోజకవర్గాల్లో సమస్యలు కనిపిస్తున్నాయి.