వ‌సంత రాజ‌కీయం అద‌ర‌హో!

తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ మూడో అభ్య‌ర్థుల జాబితాలో మాజీ మంత్రి, సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్ర‌బాబు షాక్ ఇచ్చారు. ఆయ‌న ఊహించ‌ని విధంగా నిర్ణ‌యం తీసుకున్నారు. మైలవరం సీటును ఉమాకు క‌ర‌డు గ‌ట్టిన ప్రత్యిర్థిగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. ఈ మధ్యే వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. దీంతో దేవినేని ఉమాకు సీటు లేనట్లయింది. అయితే.. వ‌సంత కూడా టీడీపీకి కొత్త‌కాదు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం టికెట్ కోసమే ఆయ‌న వైసీపీలో చేరారు.

అప్ప‌ట్లో వైసీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కించుకుని పోటీ చేశారు. విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో వైసీపీ ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించింది. దీంతో టీడీపీలోకి వెళ్లి టికెట్ ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని ఉమ.. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన నేత‌ను త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు. గ‌త ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలో దేవినేని ఉమా.. ఓటమి పాలయ్యారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ ద‌ఫా అయినా గెలిచి స‌త్తా చాటాల‌ని అనుకున్నారు.

ఇంత‌లోనే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీ గూటికి చేరడం.. ఈ సారి టికెట్‌ ఆయనకే దక్కుతుందనే ప్రచారం సాగుతోన్న తరుణంలో.. మైలవరం కాకపోయినా.. పెనమలూరు టికెట్ వస్తుందని దేవినేని ఉమ వర్గం భావించింది. కానీ, నాకు సీటు ఇవ్వా్ల్సిందే.. లేదంటే.. చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ బోడే ప్రసాద్ రాజ‌కీయ యాగీకి దిగారు. దీంతో.. చివరకు పెనమలూరు టికెట్‌ను బోడే ప్రసాద్‌కే ఇచ్చారు. ఇక, మైలవరం చేజారిపోవడమే కాదు.. ఆశించిన పెనమలూరు టికెట్‌ కూడా దేనినేని ఉమామహేశ్వరరావుకు రాకుండా పోయింది.

తాజా జాబితాలో మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు చోటు లభిచింది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థు లను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వై సీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు.

“నాపై నమ్మకం ఉంచి మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ సీటు కేటాయించిన చంద్రబాబుకి ధన్యవాదాలు. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరెలా నియోజకవర్గంలోని ప్రతిఒక్క నాయకుడిని, కార్యకర్తలను సమన్వయపరుస్తూ నా ప్రయాణం కొనసాగిస్తా” అని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇదంతా ఓకే మ‌రి దేవినేని మాటేంటి? అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే.. సీనియ‌ర్ నాయ‌కుడు.. పైగా చంద్ర‌బాబుకు అత్యంత విధేయ‌తగా ఉన్న కుటుంబం కూడా. మ‌రి ఇలాంటి నాయ‌కుడిని ప‌క్క‌న పెట్ట‌డం భావ్యం కాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.