విద్యుత్ వాడకానికీ ప్రీ పెయిడ్ మీటర్లేనా? కేంద్రం నిర్ణయం

విద్యుత్ రంగంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇళ్ళల్లోను, కమర్షియల్ గా వాడే విద్యుత్ విషయంలో భవిష్యత్తులో కేటాయించబోయే మీటర్లన్నీ ప్రీపెయిడ్ మీటర్లే ఉండాలని నిర్ణయించింది. ఈ విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసేసుకుని రాష్ట్రాలకు ముసాయిదాను పంపింది.

కేంద్రం ముసాయిదాను పంపిందంటేనే అర్దం నిర్ణయం దాదాపు తీసేసుకుందని. మనం ఇపుడు మొబైల్ ప్రీపెయిడ్ ఎలాగ వాడుతున్నామో ఇకనుండి విద్యుత్ మీటర్లు తీసుకునే వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ మీటర్లే కేటాయించాలని ముసాయిదాలో ఉంది. ఇప్పటికైతే ఇళ్ళకు, షాపుల్లో వాడకానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళకు ప్రీపెయిడ్ మీటర్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.

ఈ విధానం వల్ల ఇప్పటి వరకు కచ్చితంగా బిల్లులు చెల్లిస్తున్న వాళ్ళపై ఎటువంటి భారం పడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే బిల్లును ఎగొడుతున్నారో, ఎవరైతే బిల్లులను సక్రమంగా చెల్లించటం లేదో వాళ్ళకు మాత్రం ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే ప్రీపెయిడ్ పద్దతిలో అయితే రీచార్జి చేయించుకోకపోతే మీ మొబైల్ ఎలాగైతే పనిచేయటం మానేస్తుందో అదే పద్దతిలో విద్యుత్ సరఫరా కూడా ఆగిపోతుంది. అంటే బిల్లులు కట్టమని విద్యుత్ సంస్ధ నుండి మెసేజులు రావటం, ఉద్యోగులు వచ్చి ఫ్యూజులు తీసేయటం లాంటివేవీ ఉండవన్నమాట. బిల్లు చెల్లించి రీ చార్జి చేయించుకోకపోతే ఆ క్షణంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దాంతో వేరే దారిలేక బిల్లులను చెల్లించి తీరుతారు.

నిజానికి విద్యుత్ బిల్లుల బకాయిలను బాధపడలేకే కేంద్రం ఇటువంటి పద్దతిని ప్రవేశపెడుతోందనే అనుకోవాలి. ప్రస్తుత పద్దతిలో వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు పెండింగులో ఉంటోంది. గృహ వినియోగదారులు, కమర్షియల్ వినియోగదారులు, చివరకు ప్రభుత్వ శాఖలు కూడా లక్షల్లో విద్యుత్ బిల్లులను పెండింగులో పెట్టేస్తున్నాయి. బిల్లులైతే చెల్లించరు కానీ విద్యుత్ సరఫరా తేడా వస్తే మాత్రం అందరూ ప్రభుత్వంపై రాళ్ళేసేవాళ్ళే. అంటే పేరుకుపోతున్న విద్యుత్ బకాయాల కారణంగానే కేంద్రం ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల వ్యవస్ధను అమల్లోకి తెస్తున్న విషయం స్పష్టమైపోయింది.

ఇప్పటికే వాడుతున్న గృహ, కమర్షియల్ వాడకం విషయంలో ఇపుడున్న మీటర్లే కంటిన్యు చేస్తారా ? లేకపోతే ఇక్కడ కూడా ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తారా అనే విషయంలో క్లారిటి లేదు. అయితే ఒకసారి ఓ విధానం అమల్లోకి వచ్చిందంటే ముందు కొత్త వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించినా తర్వాత పాత వినియోగదారుల మీటర్లను కూడా మార్చేయటం ఖాయం. కాకపోతే ఎంతకాలంలో మారుస్తారు అనేదే సమస్యం.

ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తే అందుకు ముందుగానే కొంత మొత్తం చెల్లించాలి. బిల్లు చెల్లింపు తేదీ నాటికి ముందు చెల్లించిన మొత్తంలో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది ? ఎంత మొత్తానికి రీ ఛార్జి చేయించుకోవలో మెసేజ్ రూపంలో విద్యుత్ సంస్ధ నుండి మన మొబైల్ ఫోన్ కు సమాచారం అందుతుంది. దానిబట్టి అవసరమైన లేదా చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే రీ చార్జి చేయించాలి. మళ్ళీ ఈ మీటర్లలో కూడా రెండురకాలుంటాయి. మొదటిదేమో ఓ ఉద్యోగి ఇంటికే వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుని వెంటనే రీ చార్జి చేయించటం, రెండోదేమో విద్యుత్ ఆఫీసు నుండే ఎస్ఎంఎస్ పంపి రీ చార్జి చేయించటం. అంతే పద్దతి ఏదైనా ప్రీపెయిడ్ మీటర్లు ఖాయమని తేలిపోయింది.