ఆ కాపు నేత‌ల మాటల‌కు వాల్యూ ఉంటుందా..!

ఔను.. మాట చాలా ముఖ్యం. ముఖ్యంగా రాజ‌కీయాల్లో నాయ‌కులు ఇచ్చే వాగ్దానాల‌కు, చెప్పే మాట‌ల‌కు కూడా వాల్యూ ఉండాలి. ఎందుకంటే.. ఎన్నికల్లో నాయ‌కులు చెప్పే మాట‌ల‌ను బ‌ట్టి.. వారిపై ఉన్న విశ్వ‌స‌నీయ‌త‌ను బ‌ట్టి.. ప్ర‌జలు వారివైపు మొగ్గు చూపుతారు. పోలింగ్ బూతుల్లో ఓట్లు వేస్తారు. అందుకే రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త‌కు కీల‌క‌మైన పాత్ర ఉంది. ఇక‌, తాజాగా రాష్ట్రంలో కాపుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వ‌ర్గాల తీరు ఒక ఎత్త‌యితే.. కాపులు ఒక్క‌రూ ఒక ఎత్తుగా ఉన్నారు.

24 శాతం ఓటు బ్యాంకుగా ఉన్నార‌ని భావిస్తున్న కాపుల‌ను ఆక‌ట్టుకునేందుకు అన్ని పార్టీలూ ప్ర‌య‌త్నా లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కాపుల్లో బ‌ల‌మైన వాయిస్ వినిపించి, వారి ప‌క్షాన పోరాటాలు కూడా చేసిన ఇద్ద‌రుకీల‌క నాయ‌కుల‌ను వైసీపీ త‌న చెంతకు చేర్చుకుంది. త‌ద్వారా.. కాపుల్లో జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఊపును త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేయాల‌న్నది సీఎం జ‌గ‌న్ వ్యూహం. దీంతో కాపుల్లో ఐకాన్‌గా ఉన్న ఇద్ద‌రిని పార్టీలోచేర్చుకుని, కండువా క‌ప్పేశారు.

వవీరే. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య కుమారుడు.. చేగొండి సూర్య‌ప్ర‌కాశ్‌లు. వీరిద్ద‌రూ ఇటీవ‌లే వైసీపీలో చేరారు. వీరిద్వారా ఎన్నిక‌ల్లో కాపుల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌న్న‌ది వైసీపీ వ్యూహం. అయితే.. వీరికి ఒక‌ప్పుడు ఉన్న విశ్వ‌స‌నీయ‌త‌.. ఇప్పుడు లేద‌నేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. కాపుల ఉద్య‌మంతో పేరు తెచ్చుకున్న ముద్ర‌గ‌డ‌.. త‌ట‌స్థంగా ఉంటూ.. పార్టీల‌ను విమ‌ర్శించారు. కాపుల‌కు ఏమీ చేయ‌లేదన్నారు. దీంతో ఆయ‌న వెంట కాపులు ఉన్నారు. న‌మ్మారు కూడా.

ఇక‌, చేగొండి సూర్య ప్ర‌కాశ్‌.. ఒక‌ప్పుడు వైసీపీని తీవ్ర‌స్థాయిలో దూషించారు. అదేస‌మ‌యంలో కాపుల‌కు ఏమీ చేయ‌లేద‌ని కూడా వైసీపీపై విరుచుకుప‌డ్డారు. కానీ, ఇప్పుడు ఇద్ద‌రూ కూడా కండువాలు క‌ప్పుకొని వైసీపీ నాయ‌కులు అయిపోయారు. ఈ నేప‌థ్యంలో వారి మాట‌కు విశ్వ‌స‌నీయ‌త ఎంత‌? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఐదేళ్ల కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. కాపుల‌కు వీరు చేసింది ఏమీలేదు.

ఏమీ చేయించుకున్న‌ది కూడా ఏమీలేదు. క‌నీసం ప్ర‌శ్నించ‌లేదు. ఇప్పుడు వైసీపీ త‌ర‌ఫున పార్టీ ప్ర‌చారానికి సిద్ధ‌ప‌డుతుండ‌డంతో కాపుల్లో వీరి విశ్వ‌స‌నీయ‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వీరికి త‌మ సొంత ఇమేజ్‌తోపాటు.. పార్టీ ప‌రంగాకూడా ప్ర‌జ‌లు న‌మ్మ‌బోర‌ని చెబుతున్నారు.