ప్రతికూల పరిస్థితులు ఉన్న వేళ.. బడాయి మాటల కంటే కూడా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం చాలా ముఖ్యం. ఆ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. తనకు లక్ష మెజార్టీ రావటం ఖాయమన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. తనను ఓడించేందుకు అధికార పార్టీ వైసీపీ వారు ఒక్కో ఇంటికి రూ.లక్ష ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
మరో సందర్భంలో ఓటుకు లక్ష రూపాయిలు ఇచ్చినా పిఠాపురంలో తాను గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. లక్ష ఓట్ల మెజార్టీయే మన లక్ష్యమంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. తొలుత గెలుపు మీద ఫోకస్ చేయాలే తప్పించి.. మెజార్టీ మీద బడాయి మాటల్ని కాస్తంత కట్టి పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పిఠాపురం నియోజకవర్గం మీద పవన్ కు పట్టులేదని.. స్థానిక నాయకత్వం మీద పెద్దగా అవగాహన లేదని చెబుతున్నారు.
పవన్ పూర్తిగా టీడీపీ అభ్యర్థి మీదనే ఆధారపడటాన్ని మర్చిపోకూడదు. పీఠాపురం సీటును పవన్ కు కేటాయించారన్న సమాచారం బయటకు రాగానే.. తెలుగు తమ్ముళ్లు చేసిన రచ్చ గురించి తెలిసిందే. తమ మిత్రపక్షానికి చెందిన అధినేత స్వయంగా బరిలోకి దిగుతున్న వేళలో సంబరాలు చేస్తూ.. స్వాగత సత్కారాలకు ప్లాన్ చేయాల్సింది పోయి.. పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చేయటమే కాదు.. తెలుగుదేశం వర్గీయులు టీవీ చానళ్ల ఎదుట ఎంత దారుణంగా పవన్ ను దూషించారో తెలిసిందే.
అలాంటి అతకని మనసులతో కలిసి పని చేసే వేళలో.. గెలుపు మీద ఫోకస్ చేయటం బాగుంటుంది. అంతేకానీ బడాయి మాటల్ని మాట్లాడుతూ గెలుపు మీద అనవసర ధీమాను ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు. కలిసి రాని తమ్ముళ్లు.. పెద్దగా సొంతపార్టీ క్యాడర్ లేని పిఠాపుంలో లక్ష మాటలు పక్కన పెట్టి గెలుపు కోసం చెమటలు చిందించాల్సి ఉంటుదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates