జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపు రం నియోజకవర్గంపై వైసీపీ కుయుక్తులు పన్నుతోందా? ఏదో ఒక విధంగా ఇక్కడ జనసేనను ఓడించా లనే లక్ష్యంతో ముందుకు సాగుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సహజంగా రాజకీయా ల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వీటిని ఎవరూ కాదనరు. కానీ, పనిగట్టుకుని యుక్తిగా చేసే పనులు మాత్రం చర్చకు వస్తాయి.
పిఠాపురంలో వైసీపీ తరఫున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె పనితీరు ఇక్కడ అందరికీ తెలుసు. నిలకడ లేని రాజకీయం.. నిలకడలేని మనస్తత్వంతో ఆమె రాజకీయాలు చేస్తారని.. కాపు సామాజిక వర్గం లోనే ఆమె పేరు తెచ్చుకున్నారు. అయినా.. కూడా పార్టీ ఆమెకే టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయి. మరోవైపు బలమైన కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంలో పవన్ పూర్తిగాసక్సెస్ అయ్యారు.
అదేసమయంలో రాజకీయంగా టీడీపీ అభ్యర్థి వర్మ నుంచి వచ్చిన వ్యతిరేకతను కూడా సర్దు బాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో పవన్ గెలుపు ఖాయమనే వాదన వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా వైసీపీ తన రాజకీయాలకు కుటిల యుక్తులు జోడించింది. ఎక్కడో ఎప్పుడో రాజకీయాలకు దూరమైన ఓ మహిళా నేతను తీసుకువచ్చి.. పిలిచి మరీ కండువా కప్పింది. అసలు ఆమె రాను మొర్రో నాకు ఇష్టం లేదని చెప్పినా వినలేదట.
ఆమే మాకినీడు శేషు కుమారి. ఒకప్పుడు ఈమె జనసేనలోనే ఉన్నారు. 2019లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి నాకు రాజకీయాలు వద్దంటూ.. దూరంగా ఉన్నారు. అయినా.. కానీ, ఇప్పుడు వైసీపీ పట్టుబట్టి ఆమెను పిలిచి మరీ పార్టీ తీర్థం ఇచ్చింది. తెరవెనుక ఏదో జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఆమె అయిష్టంగానే పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమెను అడ్డు పెట్టుకుని ఓట్లు చీల్చే ప్రయత్నంలో వైసీపీ ఉండడం గమనార్హం. అయితే.. అసలు విషయంతెలిసిన జనసేన మాత్రం తమకేం కాదని చెబుతుండడం గమనార్హం.