టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉదయాన్నే 7 గంటలకల్లా ఉండవల్లిలోని నివాసం నుంచి మంగళగిరిలోని నిర్ణీత ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కూడా ఆయన తన కాన్వాయ్(మూడు కార్లు)తో ఉండవల్లి నుంచి బయలు దేరి.. మంగళగిరికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ఆయన కాన్వాయ్ మంగళగిరి హైవే ఎక్కగానే పోలీసులు నిలువరించారు.
దీంతో నారా లోకేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సహజంగ తన పర్యటనలను పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా తన పర్యటనలను వారు అడ్డుకుంటారని భావించారు. అయితే.. ఎన్నికల విధుల్లో భాగంగానే తాము వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో నారా లోకేష్ వారికి సహకరించారు. మొత్తం మూడు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు వాహనాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులు లభించలేదు.
సుమారు 20 నిమిషాల పాటు మూడు కార్లను పోలీసులు తనిఖీ చేయడం గమనార్హం. తనిఖీలు జరుగున్నంత సేపు.. నారా లోకేష్ కారు బయటకు దిగి పోలీసులకు సహకరించడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేయింబవళ్లు పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా.. తనిఖీలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. మంగళగిరిలో ఈ దఫా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న నారా లోకేష్ వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.
మంగళగిరిలోని పలు అపార్ట్‌మెంట్ల వాసులతో గత నాలుగు రోజులుగా లోకేశ్ రోజూ ఉదయాన్నే ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకో అపార్ట్‌మెంట్ సముదాయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు తాము ఏం చేశామో కూడా చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates