కాకినాడ జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్థి ఈయ‌నే: ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రెండు పార్ల‌మెంటు స్థానాలు జ‌న‌సేన‌కు ద‌క్కాయి . దీనిలో ఒక‌టి మ‌చిలీప‌ట్నం. రెండు కాకినాడ‌. ఈ రెండు చోట్ల కూడా కాపులు ఎక్కువ‌గా ఉన్నారు. ఇక‌, మ‌చిలీప‌ట్నం టికెట్‌కు సిట్టింగ్ ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరినే రంగంలోకి దింప‌నున్నారు. ఈయ‌న కాపు నాయ‌కుడు. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నికల్లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గం మార్చ‌డంతో ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌న‌సేన‌కు జై కొట్టారు. ఇక‌, ఆయ‌న‌కు మ‌చిలీప‌ట్నం టికెట్ ఇవ్వ‌నున్నారు.

ఇక‌, మిగిలిన కాకినాడ టికెట్‌ను తాజాగా ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ కుమార్ పేరును పవన్ ప్రకటించారు. ఉదయ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం జ‌న‌సేన పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆ స్థానంలో పవన్ బరిలోకి దిగడంతో ఉదయ్ కుమార్ కు కాకినాడ ఎంపీ సీటు ఖరారు చేశారు. ఉదయ్ తనకు తమ్ముడి లాంటి వాడని, తన విజయం కోసం కూటమి శ్రేణులు సహకారం అందించాలని పవన్ కోరారు. ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరు ప్రకటిస్తూ.. భవిష్యత్తులో నాకు ఎసరు పెట్టవు కదా అంటూ సరదాగా ప‌వ‌న్‌ వ్యాఖ్యానించారు.

ఉదయ్ తన కోసం త్యాగం చేశాడని, భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప‌వ‌న్‌ సూచించారు. తాను అందర్నీ కలుపుకొని వెళ్లే రకమ‌ని ప‌వ‌న్ చెప్పారు. తప్పదు అనుకుంటే తప్ప నేను ఎవ‌రితోనూ గొడవకు వెళ్లను అని జనసేన అధినేత పవన్ అన్నారు. పిఠాపురాన్ని ఎవరైనా భయపెడతా అంటే.. వారికి వ్యతిరేకంగా తాను అడ్డుగోడగా నిలబడతానని చెప్పారు. తనను కట్టడి చేసే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మిథున్‌ను కలిసిన సందర్భంగా ఎన్ని కష్టాలు ఎదురైనా తమ నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని చెప్పినట్లు తెలిపారు.