అంబటిని ఇరికించేసిన అనిల్


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఐదేళ్లు గ‌డిచిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ స‌ర్కారు అతి పెద్ద ఫెయిల్యూర్ల‌లో పోల‌వరం ప్రాజెక్టు ఒక‌టి. ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చేస‌రికి 70 శాతానికి పైగా పూర్త‌యిన ఆ మెగా ప్రాజెక్టును ఇంకో ఏడాదిలో పూర్తి చేస్తాం అంటూ.. ఒక్కో సంవ‌త్స‌రం గ‌డుపుతూ వ‌చ్చారు. కానీ చివ‌రికి ఎక్క‌డి గొంగ‌డి అక్క‌డే అన్న‌ట్లు త‌యారైంది ప‌రిస్థితి.

డ‌యాఫ్రాం వాల్ కూలిపోవ‌డంతో పూర్తిగా ప‌నులు ఆగిపోయి ప్రాజెక్టు భ‌విత‌వ్యం అగ‌మ్య గోచ‌రంగా మారింది. ప‌నులు ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయాయి. ఈ విష‌యంలో బాధ్య‌త తీసుకోవ‌డానికి వైసీపీ సిద్ధంగా లేదు. తొలి రెండున్న‌రేళ్లు ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాద‌వ్, ఆ త‌ర్వాత బాధ్య‌త‌లు తీసుకున్న అంబ‌టి రాంబాబు ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం మీదే విమ‌ర్శ‌లు చేస్తూ, నింద‌లు చేస్తూ వ‌చ్చారు.

కాగా తాజాగా ఎన్నిక‌ల ముంగిట ఓ టీవీ ఛానెల్లో జ‌రిగిన చ‌ర్చా వేదిక‌లో భాగంగా అనిల్ కుమార్ యాద‌వ్.. త‌న త‌ర్వాత నీటిపారుద‌ల మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న అంబ‌టి రాంబాబునే ఇరికించేశారు. కాఫ‌ర్ డ్యాం క‌ట్ట‌కుండా డ‌యాఫ్రాం వాల్ నిర్మించ‌డం త‌ప్పు క‌దా అని అడిగితే.. మినిమం బేసిక్స్ లేకుండా ఎలా చేశారు అని అడిగితే అనిల్ కుమార్ స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు.

ఇక వైకాపా ప్ర‌భుత్వ హ‌యాంలో 40 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా ఆయ‌క‌ట్టు త‌గ్గిపోవ‌డం, వ్య‌వ‌సాయం దెబ్బ తిన‌డం గురించి అడిగితే.. అది నిజ‌మే అన్న‌ట్లుగా త‌ల ఊపుతూ తాను ఇరిగేష‌న్ మినిస్ట‌ర్‌గా ఉన్నంత వ‌ర‌కు అంతా బాగానే ఉంద‌ని.. ఆ త‌ర్వాతే స‌మ‌స్య త‌లెత్తింద‌ని.. తాను మంత్రిగా దిగిపోయాక త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయ్యాన‌ని.. ఆయ‌క‌ట్టు త‌గ్గిపోవ‌డంతో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్ప‌డం ద్వారా ప‌రోక్షంగా అంబ‌టిదే త‌ప్పంతా అని చెప్ప‌క‌నే చెప్పేశారు అనిల్.