ఏపీలో త్వరలోనే జరగనున్న కురుక్షేత్ర సమరం అనంతరం.. రామరాజ్యం ఏర్పాటు కానుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అధికారం, డబ్బు అండతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళంస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి. దేశమంతా డిజిటల్ వైపు అడుగులేస్తూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే.. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో మాత్రం నగదు చలామణి చేసి దోచుకుంటున్నారు“ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40 వేల కోట్లు దోచేశారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం డ్రగ్స్ కు రాజధానిగా మారిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయిందన్నారు. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉండగా.. ఈ రోజు -3 శాతానికి పడిపోయిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని పవన్ విమర్శించారు.
చిటికెన వేలంత రావణాసురుడు
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రం అనంతరం రామరాజ్యం స్థాపన జరగబోతోందని పవన్ సభకు వచ్చిన అశేష ప్రజల కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు. ‘అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఏపీ ప్రజానీకానికి ప్రధాని మోడీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే కలయిక.. 5 కోట్ల మంది ప్రజలకు ఆనందం. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోడీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. అయోధ్యలో రామ మందిరం కట్టిన ప్రధాని మోడీకి.. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసురుడిని తీసేయడం కష్టం కాదు“ అని విమర్శలు గుప్పించారు.
వచ్చే ఎన్నికల్లో ధర్మానిదే విజయమని, పొత్తుదే గెలుపని, కూటమిదే అధికారమని పవన్ నొక్కి చెప్పారు. అమరావతికి అండగా ఉంటామని చెప్పేందుకే మోడీ వచ్చారన్నారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, 2024లోనూ మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుందని చెప్పారు. 2014లో వెంకటేశుని ఆశీస్సులతో ఎన్డీయే విజయం సాధించిందన్నారు. ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో అంతకు మించి విజయం సాధిస్తామని ఉద్ఘాటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates