సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్పందించిన బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి లాస్య నివేదిత ఆ సీటు మాదే.. నేనే పోటీ చేస్తా
అని తెలిపారు. తాజాగా శనివారం ఆమె నియోజకవర్గంలోని తమ అభిమానులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. తన తండ్రిని, సోదరిని గెలిపించినట్లే తనని కూడా ఆశీర్వదించాలని కోరారు.
నాన్న సాయన్నకు మద్దతుగా నిలిచిన ప్రజలు.. లాస్య నందితను సైతం భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. అయితే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మన యువ లీడర్ ను కోల్పోయామన్నారు. ఉప ఎన్ని్కల బరిలో తాను నిల్చొవాలని స్థానిక లీడర్లు, ప్రజలు కోరుతున్నారని, వారి మద్దతుతో తాను ఈ ఉప ఎన్ని్కల్లో పోటీ చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను త్వరలో ఇదే విషయమై కలుస్తామని నివేదిత తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఆయన కుమార్తె నందితకు బీఆర్ ఎస్ గత డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో సీటు ఇచ్చారు. ఆమె గెలిచిన విషయం తెలిసిందే.
అయితే, ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. దీంతో లోక్ సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ కు ఈసీ ఉప ఎన్నిక నిర్వహించనుంది. బీఆర్ఎస్ నివేదితకి టికెట్ ఇస్తుందా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1994 నుంచి 2018 వరకు మధ్యలో 2009 ఎన్నికలు మినగా.. మిగిలిన ఐదు సార్లు ఎమ్మెల్యేగా జి. సాయన్న విజయం ఢంకా మోగించారు.
1994, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగిన సాయన్న హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి.. రికార్డు సృష్టించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 2014లో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన సాయన్న.. 2018లోనూ తన విజయ పరంపరను కొనసాగించారు. అయితే.. అనారోగ్య కారణాలతో సాయన్న 2023, ఫిబ్రవరి 19న హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సాయన్న మృతి త్వరాత.. ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని స్థానిక నేతలు, అభిమానుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ అధిష్ఠానం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చింది. బీటెక్ చదివిన లాస్యనందిత.. గెలిచి తన తండ్రి పేరును నిలబెట్టారు. అయితే.. ఎమ్మెల్యేగా గెలిచి మూడు నెలలు గడవకముందే.. ఘోర రోడ్డు ప్రమాదంలో.. లాస్య నందిత తుదిశ్వాస విడిచారు. దీంతో.. ఇప్పుడు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు దివంగత నేత సాయన్న ఇంకో కుమార్తె లాస్య నివేదిత పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు కేసీఆర్ ఆమెకే టికెట్ ఇవ్వచ్చు.