కూటమి ఆధ్వర్యంలో మొదటి బహిరంగసభ ఆదివారం మధ్యాహ్నం జరగబోతోంది. టీడీపీకి బాగా పట్టున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగసభకు నరేంద్రమోడీ స్వయంగా హాజరవుతున్నారు. అందుకనే అందరి దృష్టి మోడీపైనే నిలిచింది. బహిరంగసభకు మోడీ హాజరవ్వటం, మాట్లాడటం చాలా మామూలే. కాని ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. అదేమిటంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటివకు మంచి సంబంధాలున్నాయి. ఇదే సమయంలో వైసీపీ, బీజేపీలు మాత్రం ఒకదానిపై మరోటి ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి.
తాజా పరిణామాల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టుకట్టింది. ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం వేరు, పార్టీల మధ్య సంబంధాలు వేరు. పైగా ఎన్నికల్లో పార్టీల మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది. వైసీపీ-టీడీపీ, వైసీపీ-జనసేన మధ్య సంబంధాలు చాలాకాలంగా ఉప్పునిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి స్ధితిలో వీళ్ళతో బీజేపీ జతకట్టింది. పై మూడుపార్టీల కీలక నేతల టార్గెట్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల మొదటి బహిరంగసభకు హాజరవుతున్న మోడీ కూడా జగన్ను టార్గెట్ చేస్తారా ? చేయరా అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.
మోడీ మాటలను బట్టి జగన్ పైన వైఖరి ఏమిటనేది అర్ధమవుతుంది. చంద్రబాబు, పవన్ , పురందేశ్వరి లాగే జగన్ పైన మోడీ కూడా ఆరోపణలతో విరుచుకుపడితే ఇప్పటినుండి కథ వేరేగా ఉంటుంది. అలా కాకుండా తూతుమంత్రంగా మాట్లాడినా, జగన్ పైన ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా విషయం మరో రకంగా ఉంటుందనటంలో సందేహంలేదు. ఎందుకంటే జగన్ కు వ్యతిరేకంగా పవన్, పురందేశ్వరి ఎంతగా గొంతుచించుకుంటున్నా కేంద్రప్రభుత్వం పెద్దలు అసలు పట్టించుకోవటంలేదు.
జగన్ ఢిల్లీకి వెళుతునే ఉన్నారు, మోడీ, అమిత్ షాలను కలుస్తున్నారు, నిధులను రిలీజ్ చేయించుకుంటునే ఉన్నారు. కాని ఇపుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అన్న సంబంధాల కన్నా నరేంద్రమోడి, జగన్ అని మాత్రమే చూడాల్సుంటింది. వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న మూడుపార్టీల కూటమి తరపున బహిరంగసభకు హాజరువుతున్నారు కాబట్టి సహజంగానే వైసీపీ ప్రభుత్వంపైన, జగన్ పైన మోడీ ఆరోపణలతో విరుచుకుపడతారని అనుకుంటున్నారు. మరి చివరకు మోడీ ఏమి చేస్తారో చూడాలి.