“నేను చెబితే కవితను అరెస్టు చేస్తారా? అలా అయితే చాలా మందే ఉన్నారు. మరి వారందరినీ ఎందుకు అరెస్టు చేయరు. అంటే.. ఒక వ్యక్తి చెప్పారనో.. లేక నాయకుడు చెప్పారనో ఎలాంటి అరెస్టులు జరగవు. కేవలం చట్టం, న్యాయం, కోర్టులు వంటివి ప్రామాణికంగా తీసుకునే ఎవరినైనా వారు చేసిన నేరాలను బట్టి అరెస్టు చేస్తారు“ – అని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కుదిపేస్తున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారంపై షా తాజాగా స్పందించారు.
కవిత అరెస్టులో ఎలాంటి కుట్రకోణం లేదని అమిత్ షా చెప్పారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరగలేదని చెప్పారు. హోం మంత్రి చెబితే నేతలను అరెస్ట్ చేయడం లాంటివి జరగవని, కోర్టు ఆదేశాలను దర్యాప్తు సంస్థలు పాటిస్తాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ఎప్పటినుంచో జరుగుతోందని, ఇది కొత్త ఎపిసోడ్ కాదన్నారు. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కేసుల విచారణ జరపడం ఉండదని అమిత్ షా స్పష్టం చేశారు.
ఓ మీడియా సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా కవిత ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు విచారించారు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆమెను అరెస్టు చేస్తున్న ప్రకటించి.. ఆ వెంటనే ఢిల్లీకి తీసుకువెళ్లారు. శనివారం ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హజరు పరిచారు.
కానీ, లిక్కర్ కేసు వ్యవహారంపై రాజకీయంగా అనేక విమర్శలు ఉండడం తెలిసిందే. తమను అణిచి వేసేందుకు బీజేపీ పన్నిన కుట్రగా బీఆర్ ఎస్ నాయకులు తరచుగా విమర్శలు గుప్పించారు. గతంలో అప్పటి సీఎంగా కేసీఆర్ కూడా ఈడీలు బోడీలు తమను ఏమీ చేయబోవని వ్యాఖ్యానించారు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకంఆ ఆయన అప్పట్లో ఆరోపించారు. అయితే.. తాజాగా పార్లమెంటు ఎన్నికలకు ముందు కవితను అరెస్టు చేయడం గమనార్హం.