కాపు ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ముద్రగడ ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని, ఆయనను జనసేనలోకి ఆహ్వానిస్తారని కొద్దికాలం క్రితం ప్రచారం జరిగింది. అయితే వైసీపీ కోవర్టు అంటూ 2014 నుంచి ముద్రగడపై ఓ ముద్ర ఉండటంతో ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ సందేహించారని, అందుకే ముద్రగడతో పవన్ భేటీ కాలేదని టాక్. ఆ తర్వాత వైసీపీలో చేరిన ముద్రగడపై జనసైనికులు, కాపు నేతలు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ….పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను మార్చేందుకు తాను ఎంతో ప్రయత్నించానని, కానీ ఆయన తన మాట వినలేదని అన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ ఓడిపోయారని, ఈ ఎన్నికల్లో 21 సీట్లకే పరిమితం అయ్యారని చెప్పారు. ఈ సీట్లలో ఎన్ని గెలుస్తారో పవన్ కే తెలియదని ఎద్దేవా చేశారు. పవన్ కు రాజకీయం తెలియదని, ఈ ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో సినిమా వాళ్ళని ఆదరించే రోజులు పోయాయని అన్నారు.
తనపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని, ఘనమైన కుటుంబ చరిత్ర తనదని ముద్రగడ అన్నారు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు తనకు పాఠాలు చెబుతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వారు చెప్పినట్టు తాను రాజకీయాలు ఎందుకు చేయాలని, తనకు చెప్పడానికి ఆయన ఎవరని పరోక్షంగా పవన్ ను ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ ఎక్కడున్నారని ముద్రగడ అన్నారు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్ సినిమాల్లో హీరో కావచ్చుని, కానీ, రాజకీయాల్లో తానే హీరోనని ముద్రగడ చెప్పారు.
సినిమాల్లో పవన్ గొప్ప కావచ్చని, కానీ, రాజకీయాల్లో తాను గొప్ప అని అన్నారు. ఆ మాటకొస్తే రాజకీయాల్లో, సినిమాల్లో కూడా తానే ముందున్నానని చెప్పారు. మీరా నాకు పాఠాలు నేర్పేది అని జనసేన కార్యకర్తలపై ముద్రగడ ఫైర్ అయ్యారు. కాపు సోదరులు, దళితులు, బీసీల భిక్షతోనే ఈ స్థితికి వచ్చానని, ఏ ఉద్యమం చేసినా కాపు సోదరులతో పాటు బీసీలు, దళితులు ముందుండి నడిపించారని ముద్రగడ అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి వైసీపీని ఎంచుకున్నానని, అందుకే బేషరతుగా వైసీపీలో చేరానని ముద్రగడ చెప్పారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నానని, కాకపోతే కొన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చిందని ముద్రగడ చెప్పారు. మళ్ళీ వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.