పొత్తు ధర్మం మంచిదే. అయితే.. ఈ పొత్తులోనూ అవతలి పక్షం ఏమాత్రం కష్టపడకుండానే గెలిచేలా చేస్తే.. అది పొత్తు ధర్మం కింద రాదని అంటున్నారు బీఆర్ ఎస్ నాయకులు. కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇలానే చేశారు. బీఎస్పీతో చేతులుకలిపిన కేసీఆర్.. రెండు పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. వీటిలో ఒకటి నాగర్ కర్నూల్. రెండోది హైదరాబాద్. సరే.. హైదరాబాద్ అంటే.. ఎంఐఎంకే హవా ఉంటుంది కాబట్టి.. ఇక్కడ ఎవరు పోటీ చేసినా.. కష్టపడాలి. పడినా గెలుస్తారనే ఛాయిస్ తక్కువే.
కానీ, కీలకమైన నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గాన్ని కేసీఆర్ వదులు కోవడం అంటే.. గెలుపు ను బంగారపు పళ్లెంలో పెట్టి అందించడమేనని అంటున్నారు నాయకులు. నాగర్ కర్నూలు నియోజకవర్గం.. బీఆర్ఎస్‌కు కంచుకోట. 2014లో కేవలం 8 వేల ఓట్లతేడాతో ఓడిపోయినా.. 2019 ఎన్నికల్లో మాత్రం ఏకంగా లక్షా 40 వేల ఓట్ల తేడాతో విజయం దక్కించుకుంది. ఇక్కడ నుంచి పోతుగంటి రాములు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
దీంతో ఆయన పోయి బీజేపీలో చేరారు. ఈయన కుమారుడు పోతుగంటి భరత్‌కు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇంత బలమైన నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ అధినేత బీఎస్పీకి ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర చీఫ్, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ పోటీచేయనున్నారు. ఆయన గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది. కానీ, కేసీఆర్ నిర్ణయంపై పార్టీ నాయకులు మాత్రం అసంతృప్తితోనే తలలూపారు.
కట్ చేస్తే.. ఇప్పటి వరకు బీఆర్ఎస్.. చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్- కడియం కావ్య, జహీరాబాద్- గాలి అనిల్‌కుమార్ , నిజామాబాద్- బాజిరెడ్డి గోరవర్ధన్ రెడ్డి, ఖమ్మం- నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్- మాలోత్ కవిత, కరీంనగర్- బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్, మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి, మల్కాజ్‌గిరి- రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్- ఆత్రం సక్కులకు కేసీఆర్ టికెట్లు కేటాయించారు. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates