పదేళ్ళ ప్రస్తానం.! ఈసారి అత్యంత కీలకం.!

జనసేన పార్టీ ఆవిర్భవించి పదేళ్ళవుతోంది. పదో వార్షికోత్సవ వేడుకల్ని జనసేన పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల సంవత్సరం గనుక, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఓ బహిరంగ సభను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరిపి వుంటే బావుండేది.

అయితే, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక.. వంటి కీలక వ్యవహారాల్లో తలమునకలై వున్న జనసేనాని, బహిరంగ సభ ఆలోచనని చివరి నిమిషంలో విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులతో స్వయంగా భేటీ అయి, వారికి బీ-ఫామ్స్ కూడా జనసేనాని ఇచ్చేస్తున్నారు.

టిక్కెట్ ఖాయమవుతుందా.? అవదా.? అన్న ఆందోళనలో వున్న ఆశావహుల్లో చాలామందికి ఇప్పటికే తీపి కబురు అందగా, సందీప్ పంచకర్ల, పోతిన వెంకట మహేష్ తదితరులు ఇంకా ఎదురుచూడాల్సి వస్తోంది తీపి కబురు కోసం.

టిక్కెట్ వచ్చినా, రాకపోయినా జనసేనతోనే తమ ప్రయాణం.. అని తణుకు జనసేన నేత విడివాడ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్నీ ఆశ్చర్యపరిచాయి. ఆయన పార్టీ మారతారనే ప్రచారం నిన్న మొన్నటిదాకా కూడా జరిగింది. కానీ, ఆయన జనసేనతోనే వుంటానని ఇంకోసారి స్పష్టం చేసేశారు.

ఇక, పదేళ్ళ ప్రస్తానంలో జనసేన పార్టీకి దక్కింది ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు. అందుకే, ఈసారి జరగబోయే ఎన్నికలు జనసేన పార్టీకి అత్యంత కీలకం. 21 మంది అసెంబ్లీకి, ఇద్దరు లోక్ సభకు ఈసారి జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ – బీజేపీలతో పొత్తు, జనసేన పార్టీకి కలిసొచ్చే అంశమే.

98 శాతం స్ట్రైక్ రేట్.. అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు నిజమైతే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో, జనం తరఫున జనసేన సభ్యులు నినదించే నినాదం.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక మలుపు.. అనడం నిస్సందేహం.

రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, పదేళ్ళపాటు జనసేనాని స్థిరంగా నిలబడటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అది కూడా, డబ్బుమయ రాజకీయాల్లో, మార్పు అనే నినాదంతో నిలబడటం చాలా చాలా గొప్ప విషయం.