చంద్ర‌బాబు ఫోన్‌.. బోడే ఆన్ ఫైర్

ప్ర‌స్తుతం అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంపై ఆచి తూచి అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రెండు జాబితాలు విడుద‌ల చేశారు. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మందికి అవ‌కాశం ఇచ్చారు. అయితే.. కీల‌క‌మైన కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఆయ‌న ఎవ‌రినీ ఎంపిక చేయ‌లేదు. ఇలాంటి వాటిలో పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. తాజాగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌కు చంద్ర‌బాబు ఫోన్ చేశారు.

రెండో జాబితా విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు నేరుగా బోడేతో మాట్లాడారు. ఈ సారికి స‌ర్దుకోవాల‌ని.. అనివార్య కార‌ణాల నేప‌థ్యంలో టికెట్ ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న చెప్పేశారు. దీనిపై బోడే ప్ర‌సాద్ భ‌గ్గు మ న్నారు. చంద్ర‌బాబుతోనే పార్టీకి రాజీనామా చేస్తాన‌ని తెగేసి చెప్పారు. అంతేకాదు.. న‌చ్చిన వారికి ఇచ్చుకోచ్చ‌ని.. కానీ, ఇన్నాళ్లుగా తాను పెట్టిన ఖ‌ర్చును కూడా తిరిగి ఇవ్వాల‌ని ఆయ‌న కోర‌న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫోన్‌లోనే చంద్ర‌బాబు వ‌ర్సెస్ బోడే ప్ర‌సాద్ మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగిన‌ట్టు తెలుస్తోంది.

క‌ట్ చేస్తే.. పెన‌మ‌లూరులో టీడీపీ జెండా మాయ‌మ‌య్యాయి. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉన్న ఫ్లెక్సీల‌ను కూడా తొల‌గించారు. పార్టీ కార్యాల‌యానికి కొంద‌రు తాళాలు వేశారు. బ‌య‌ట ఏర్పాటు చేసిన లైటింగ్‌ను ధ్వంసం చేశారు. ప్ర‌చార వాహనాన్ని గుర్తు తెలియ‌ని వారు ఎత్తుకు పోయారు. మొత్తంగా పెన‌మ‌లూరు టీడీపీలో ఇప్పుడు ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెగుతోంది.

మ‌రోవైపు… బోడే ప్ర‌సాద్ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ఆయ‌న వెంట వేలాది మంది అనుచ‌రులు కూడా పార్టీకి గగుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. సాయంత్రం కానూరులో కీల‌క‌స‌మావేశం ఏర్పాటు చేసుకుని భ‌విష్య‌త్తు కార్య‌క్రమాల‌పై నిర్ణ‌యం తీసుకునేందుకు బోడే వ‌ర్గం రెడీ అయింది. మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది చూడాలి.