తెరపైకి మూడో సమన్వయకర్త ?

jagan

ముచ్చటగా మూడో అభ్యర్థి పేరు పరిశీలనలో ఉందట. విషయం ఏమిటంటే గుంటూరు పార్లమెంట్ సీటును గెలుచుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. గడచిన రెండు ఎన్నికల్లో ఎంత ప్రయత్నించినా సీటులో గెలుపు తృటిలో తప్పిపోయింది. రెండుసార్లు కూడా టీడీపీ నేత గల్లా జయదేవే గెలిచారు. రాబోయే ఎన్నికల్లో జయదేవ్ పోటీచేయటం లేదు. అందుకనే టీడీపీ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇదే సమయంలో ఈ సీటులో గెలిచేందుకు జగన్ ఇప్పటికి ఇద్దరు సమన్వయకర్తలను మార్చారు.

మొదట ఇక్కడి నుండి పోటీ చేయమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులును జగన్ కోరారు. అందుకు లావు అంగీకరించకపోగా ఏకంగా పార్టీకి రాజీనామా చేసి టీడీపీ అభ్యర్ధిగా తిరిగి నరసరావుపేటలోనే పోటీచేస్తున్నారు. దాంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు ఉమ్మారెడ్డి వెంకటరమణను సమన్వయకర్తగా నియమించారు. నాలుగు రోజులు అవగానే రమణను తీసేసి పొన్నూరు ఎంఎల్ఏ, ఉమ్మారెడ్డి అల్లుడు వెంకట కిలారు రోశయ్యను సమన్వయకర్తగా నియమించారు. జగన్ నియమించారు కానీ రోశయ్య యాక్టివ్ గా లేరు. పోటీచేసే విషయంలో అనాశక్తిగా ఉన్నారట.

అందుకనే రోశయ్య స్ధానంలో ముస్లిం మహిళ, సమాజసేవలో పాపులర్, విద్యావంతురాలైన జహారాబేగంను తొందరలోనే రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. జహారాబేగం అభ్యర్ధిత్వంపై జగన్ బాగా ఇంట్రెస్టు చూపుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈమె పోయిన ఎన్నికల్లో విజయవాడలో ఎంపీగా పోటీ చేయాల్సింది. అయితే ఎందుకనో అప్పట్లో టికెట్ చేజారిపోయింది. అదే అంశం ఇపుడు మళ్ళీ ప్రస్తావనకు వచ్చిందట. విషయం ఏమిటంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎంఎల్ఏ అభ్యర్ధిగా ముస్తాఫా కూతురును నియమించారు.

దీనికి అదనంగా ఎంపీ అభ్యర్ధిగా కూడా ముస్లిం మహిళను దింపితే గెలుపు అవకాశాలు ఎలాగుంటుందనే విషయంపై జగన్ సర్వే చేయించుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. పరిస్ధితులన్నీ అనుకూలంగా ఉంటే జహారాబేగం ఎంపీగా వైసీపీ తరపున పోటీచేయటం ఖాయమని పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. పోటీ వరకు ఓకేనే కాని గెలుపు అవకాశాలపైనే సరైన క్లారిటి రావటంలేదట. మరి చివరకు ఏమవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.