ఇంతకీ భీమవరంలో పోటీచేసేదెవరు ?

ఇపుడిదే అంశంపై జనసేనలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ప్రధాన కారణం ఎవరంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో భీమవరంలో పోటీచేయబోయేది పవనే అని పార్టీ నేతలు లీకులిచ్చారు. సర్వేలు చేయించుకుంటున్నారంటు ఊదరగొట్టారు. తీరాచూస్తే సీన్ అంతా మారిపోయింది. దీనికి కారణం ఏమిటంటే జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులనే చెప్పాలి. పవన్ స్వయంగా మాజీ ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళి రాబోయే ఎన్నికల్లో భీమవరం ఎంఎల్ఏగా పోటీచేయాలని అడిగినట్లు ప్రచారం జరిగింది.

దాంతో భీమవరంలో పవన్ పోటీచేయటంలేదని అర్ధమైంది. అయితే జనసేనలో పులపర్తి చేరిన సందర్భంలో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో ఇక్కడినుండి పోటీచేయబోయేది పవనే అని ప్రకటించారు. దాంతో జనసేన నేతలతోపాటు క్యాడర్లో అయోమయం పెరిగిపోతోంది. పవనేమో ఆంజనేయులను పోటీచేయమంటారు. రామాంజనేయులేమో పవనే పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. దాంతో అసలు భీమవరంలో ఇద్దరిలో పోటీచేయబోయేది ఎవరనేది అర్ధంకావటంలేదు. అయినా మిత్రపక్షం టీడీపీ నేతను తన పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చి పోటీచేయించాలనే ఆలోచన చేసిన నేత బహుశా పవన్ ఒక్కరేనేమో.

రామాంజనేయులునే పోటీచేయించాలని పవన్కు ఉన్నపుడు టీడీపీలో నుండి జనసేనలోకి చేర్చుకోవటం ఎందుకో అర్ధంకావటంలేదు. భీమవరం సీటును టీడీపీకి వదిలేస్తే అసలు ఏ గొడవా ఉండేదికాదు కదా. విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో పవన్ తో పాటు రామాంజనేయులు కూడా పోటీచేసి వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. అప్పటినుండి ఇప్పటివరకు రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. ఒకవిధంగా రామాంజనేయులను టీడీపీనే మరచిపోయిందనే చెప్పాలి.

అలాంటి రామాంజనేయులు ఇంటికి స్వయంగా పవన్ వెళ్ళటం, జనసేనలో చేరమని కోరటం, భీమవరంలో పోటీచేయమని అడగటం చాలా విచిత్రంగా ఉంది. రామాంజనేయులు కెపాసిటిని పవన్ ఏ విధంగా అంచనా వేశారో ఎవరికీ అర్ధంకావటంలేదు. జనసేన పోటీచేయబోయే సీటులో టీడీపీ నేతను టికెట్ ఇవ్వటానికి పవన్ సిద్ధపడటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ ఉద్దేశ్యంలో భీమవరంలో గ్రంధిని ఓడించేంత సీనున్న నేత జనసేనలో లేరనేకదా ? మరి పవన్ వ్యూహం ఏ మేరకు వర్కవుటవుతుందో చూడాలి.