జేజమ్మ‌కు జై!.. బీజేపీ తాజా లిస్ట్‌లో చోటు!

గ‌ద్వాల్ జేజ‌మ్మ‌గా పేరొందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ‌కు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో ఆమెను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానం నుంచి ఎంపిక చేసింది. ఆమె ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు. ఇక‌, ఈమెతోపాటు మ‌రో ఆరుగురికి కూడా క‌మ‌ల నాథులు టికెట్లు కేటాయించారు. వీరిలో మెద‌క్ స్థానానికి ఎం. ర‌ఘునంద‌న్ రావు, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ ఆదిలాబాద్ నుంచి గోదామ్ నాగేశ్‌, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం పెద్ద‌ప‌ల్లి నుంచి గోమాసా శ్రీనివాస్‌, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌హ‌బూబాబాద్ నుంచి అజ్మీరా సీతారామ్ నాయ‌క్, న‌ల్ల‌గొండ నుంచి సైదా రెడ్డి ఉన్నారు.

ఇప్ప‌టికే 9 స్థానాల‌కు బీజేపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా విడుద‌ల చేసిన జాబితాతో మొత్తం 17 స్థానాల‌కు గాను 15 మంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన‌ట్ట‌యింది. మిగిలిన స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇదిలా వుంటే.. దేశ‌వ్యాప్తంగా కూడా.. ప‌లువురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ బీజేపీ జాబితా విడుద‌ల చేసింది. మొత్తం 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను తాజాగా ఇచ్చింది.

బాపూరావు దారెటు?

ఆదిలాబాద్ ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో బీజేపీటికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న సోయం బాపూరావు ఊహించిందే జ‌రిగింది. ఆయ‌న‌కు బీజేపీ ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌లేదు. ఇటీవ‌ల ఆయ‌న ఈ విష‌యంపై త‌న‌కు స‌మాచారం ఉంద‌ని.. స్థానిక నాయ‌కులే త‌న సీటుకు ఎస‌రు పెడుతున్నార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని.. త‌న‌ను పోటీ నుంచి ఎవ‌రూ త‌ప్పించ‌లేర‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాని ఆదిలాబాద్ ప‌ర్య‌ట‌న‌లోనూ ఆయ‌న పాల్గొన్నారు. కానీ, తాజా జాబితాలో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో బాపూరావు ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

ముగ్గురికి టికెట్

చిత్రం ఏంటంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ తెలంగాణ‌లో నాలుగు స్థానాల నుంచి విజ‌యం ద‌క్కించుకుంది. వీటిలో ముగ్గురికి మ‌రోసారి టికెట్ ఇచ్చారు. వీరిలో బండి సంజ‌య్‌(క‌రీంన‌గ‌ర్‌), కిష‌న్‌రెడ్డి(సికింద్రాబాద్‌) ఉన్నారు. కానీ, బాపూరావును (ఆదిలాబాద్‌) మాత్రం త‌ప్పించ‌డం గ‌మ‌నార్హం.