మ‌ల్కాజిగిరి నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ నేత ఈయ‌నే

తెలంగాణ‌లో అత్యంత కీల‌క‌మైన పార్ల‌మెంటు స్థానంగా ఉన్న మ‌ల్కాజిగిరి నుంచి బీఆర్ ఎస్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచే అభ్య‌ర్థి ఖ‌రారయ్యారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శంభీపూర్ రాజు ఇక్క‌డ పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోటీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి తప్పుకోవడంతో శంభీపూర్ రాజుకు అవకాశం ఇవ్వాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. శంభీపూర్ రాజు.. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ తో ఉన్నారు. గతంలో ఆయన కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేయాలని భావించినా.. చాన్స్ లభించలేదు. దీంతో కేసీఆర్ ఆయ‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు.

గ‌త ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ శంభీపూర్‌రాజు టిక్కెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించే క్రమంలో కేపీ వివేకానంద్ కే మ‌ళ్లీ చాన్స్‌ ఇచ్చారు. దీంతో రాజు తొలుత అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత పార్టీ గెలుపు కోసం పని చేశారు. ఇదిలావుంటే, మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాం రాం చెప్పారు. ఈ నేప‌థ్యంలో అనేక వ‌డ‌పోత‌ల అనంత‌రం కేసీఆర్‌.. శంభీపూర్ రాజును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. అయితే.. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆసక్తి చూపడంతో ఆయనకు చాన్సిచ్చారు. ఈ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజు పోటీ చేయలేకపోయారు.

ఇప్పుడు కూడా మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ పా ర్టీ నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పోటీ నుంచి విరమించుకున్నారు. దీంతో శంభీపూర్ రాజుకు ల‌క్కు క‌లిసివ‌చ్చింది. ఇక‌, మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. అన్ని సెగ్మెంట్లలో కలిపి మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెలుపు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

సీఎం రేవంత్‌కు ప్ర‌తిష్టాత్మ‌కం

మ‌ల్కాజిగిరి స్థానం సీఎం రేవంత్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇది ఆయ‌న‌కు సిట్టింగు సీటు. దీంతో ఈ నియోజకవర్గాన్ని మ‌రోసారి కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక‌, బీజేపీ ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా బరిలోకి దిపింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్‌లు వేస్తున్నారు. దీంతో ఇక్క‌డ నుంచి ఎవ‌రు గెలుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.