కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ అధికార పార్టీ వైసీపీలో తీవ్ర కలకలం రేగింది. సీఎం జగన్ కేబినెట్‌లోని మంత్రి విడదల రజనీపై సొంత వైసీపీ నాయకుడు, ఎన్నారై నేత మల్లెల రాజేశ్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ఇప్పిస్తానని మంత్రి రజనీ 6.5 కోట్లు వసూలు చేశారు
అని బహిరంగ వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. దీంతో మంత్రి విడదల రజనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం సీటు విషయం వైసీపీలో దుమారం రేపింది. మంత్రి రజనీని మార్పులు, చేర్పుల్లో భాగంగా పార్టీ అధిష్ఠానం.. చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేసింది. రానున్న ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఆమె పోటీ చేయనున్నారు.
అయితే, మంత్రి రజనీని గుంటూరు పశ్చిమ ఇన్చార్జ్ గా నియమించిన రోజే మల్లెల రాజేశ్ నాయుడును చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా సీఎం జగన్ నియమించారు. అప్పట్లో ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి రజని సమర్ధించారు. అయితే.. తెరచాటున ఏం జరిగిందో ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా వెల్లడైంది. అదికూడా మల్లెలకు చిలకలూరిపేటలో గెలుపు అవకాశాల్లేవని భావించిన వైసీసీ అధిష్టానం ఆయన స్థానంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడును బరిలో నిలిపింది. ఈ మేరకు మంగళవారం రాత్రి జాబితా కూడా విడుదల చేసింది.
అయితే.. ఈ విషయాన్ని రెండు రోజుల కిందటే రాజేశ్ నాయుడుకు కూడా చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ గుట్టును బట్టబయలు చేశారు. తనకు సీటు ఎలా వచ్చిందో చెప్పేశారు. సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లిన మంత్రి రజనీ.. తనకు సీటు ఇప్పించినందుకు రూ.6.5 కోట్లు డిమాండ్ చేసి వసూల్ చేశారని మల్లెల తాజాగా వెల్లడించారు. ఇప్పుడు తనకు సీటు లేకుండా పోయిందని.. ఈ నేపథ్యంలో తిరిగి తన డబ్బులు తనకు ఇచ్చేయమని ఆడిగితే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పంచాయితీ పెట్టగా రజనీ నుంచి రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించారని తెలిపారు. మంత్రి రజనీకి సత్తా ఉంటే చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎక్కడో గుంటూరుకు చెందిన మనోహర్‌నాయుడును పేటకు తీసుకొస్తే తాము అతని గెలుపు కోసం పనిచేసేందుకు సిద్ధంగా లేమని హెచ్చరించారు.
తనను మార్చాలనుకునే పక్షంలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు(ప్రస్తుతం ఎమ్మెల్సీ) సీటు ఇవ్వాలని అతనికి సీటిస్తే రూ.20 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని. తెలిపారు. వాస్తవానికి రాజశేఖర్‌కు ఎంతో అన్యాయం జరిగిందని, 2019 ఎన్నికల సమయంలో రజనీని గెలిపిస్తే మర్రికి ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కట్టబెడతానని హామీ ఇచ్చి.. సీఎం జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. మర్రికి మంత్రి పదవి ఇవ్వకపోగా రజనీకి మంత్రి పదవి ఇచ్చి రాజశేఖర్‌ను మరింత అవమానించారని అన్నారు. ఇప్పటికైనా మర్రి రాజశేఖర్‌కు చిలకలూరిపేట సీటు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.