మోడీ మ‌రో విశ్వ‌రూపం..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త‌న విశ్వరూపం మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌లు, జ‌మ్ము క‌శ్మీర్ విభ‌జ‌న, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు వంటి అనేక నిర్ణ‌యాల‌తో త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించిన ప్ర‌దాని మోడీ.. తాజాగా పౌర స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం-2019(సీఏఏ(CAA)-సిటిజ‌న్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌)ను అమ‌ల్లోకి తెచ్చేసింది. త‌క్ష‌ణ‌మే ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర హొంశాఖ‌ ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది.

మ‌రో నాలుగు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో సీఏఏ వంటి ఎంతో మంది వ్య‌తిరేకించిన చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తెస్తూ కీలక నిర్ణయం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. పార్లమెంట్‌లో ఐదేళ్ల క్రితం ఈ బిల్‌ పాస్ అయింది. అప్పటి నుంచి అమలుకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాస్త‌వానికి 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో CAA ని చేర్చింది. పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుందని కేంద్రం వివరిస్తోంది.

ఏం జ‌రుగుతుంది?

పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుంది. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం లభించనుంది. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్‌లకు పౌరసత్వం లభిస్తుందని కేంద్రం గెజిట్‌లో తెలిపింది. నాటి పాత చట్టంలో మార్పులు చేర్పులు చేసి 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం రూపొందించింది.

అన్నీ బాగున్నాయ‌ని తేల్చుకున్నాకే..

రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. హోం మంత్రి అమిత్ షా దీనిని అమలు చేయడంపై చాలా పట్టుదలతో ఉన్నారు. ఎప్పుడో అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి. ఫలితంగా వెనక్కి తగ్గారు. కానీ…ఈసారి దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ.. త‌మ‌కు సానుకూల ప‌వ‌నాలు బాగానే ఉన్నాయ‌ని గుర్తించిన ద‌రిమిలా.. దీనిని అమ‌లు చేసేందుకు ఓకే చేశారు. ఆ వెంట‌నే సీఏఏ అమ‌ల్లోకి తెస్తూ.. నిర్ణ‌యం తీసుకున్నారు.

100 మంది మృతి
గతంలో ఈ చట్టం అమలు చేస్తామన్నప్పుడు జరిగిన అల్లర్లలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌ పోర్ట్‌లనీ రూపొందించినట్టు హోంశాఖ వెల్లడించింది.